logo

ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ !

ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో  కొన్ని కేంద్రాల్లో ‘మాస్‌ కాపీయింగ్‌’ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Published : 21 Mar 2023 02:11 IST

వనపర్తి, న్యూస్‌టుడే

వనపర్తిలోని ఓ ప్రైవేటు పరీక్ష కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న డీఐఈవో జాకిర్‌హుస్సేన్‌

ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో  కొన్ని కేంద్రాల్లో ‘మాస్‌ కాపీయింగ్‌’ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియరు కళాశాలల్లో కలిపి మొత్తం 26 పరీక్ష కేంద్రాలున్నాయి. వీటిలో మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియరు కళాశాలలూ ఉన్నాయి. వీటిలో అక్కడి విద్యార్థులే కాకుండా సమీప గురుకులాలు, కేజీబీవీల వారూ పరీక్షలు రాస్తున్నారు. ఇలాంటి కొన్ని కేంద్రాల్లో కాపీయింగ్‌ జోరుగా సాగుతున్నట్టు సమాచారం అందింది. పరీక్ష జరిగే సబ్జెక్టు మినహా మిగతా అధ్యాపకుల్ని ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు. కొన్ని చోట్ల ఎస్‌జీటీలనూ పరీక్షల పర్యవేక్షకులగా వేశారు. జిల్లాలోని శ్రీరంగాపురం, ఖిల్లాగణపురం, పాన్‌గల్‌, వీపనగండ్లల్లోని జూనియర్‌ కళాశాలలు ‘సెల్‌్్ఫ సెంటర్లు’గా ఉన్నాయి. వీటిలో అక్కడి విద్యార్థులే పరీక్షలు రాస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాల శాతం దిగజారకుండా కొందరు అధ్యాపకులు తమ వంతుగా కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో రెండు, నాలుగు మార్కుల ప్రశ్నల సమాధానాలను కాపీ చేస్తున్నారని తెలిసింది. ఈ విషయమై డీఐఈవో జాకిర్‌హుస్సేన్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ‘సెల్ఫ్‌ సెంటర్ల’పై ప్రత్యేక దృష్టి పెట్టామని, స్క్వాడ్‌లూ తనిఖీలు చేస్తున్నాయని చెప్పారు. అయినా మరోసారి ఆయా కేంద్రాలకు స్క్వాడ్లను పంపి, తనిఖీ చేసి, కాపీయింగ్‌ జరగకుండా చూస్తామని చెప్పారు.

304 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం మొదటి సంవత్సరం గణితశాస్త్రం-1, రాజకీయశాస్త్రం-1, వృక్షశాస్త్రం-1 పరీక్షలు జరిగాయి. మొత్తం 304 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌ కోర్సు విద్యార్థులు 6016 మందికి గాను 5776 మంది హాజరవగా, 240 మంది గైర్హాజరయ్యారు. వృత్తివిద్యాకోర్సు విద్యార్థులు 1192 మందికి గాను 1128 మంది హాజరవగా, 64 మంది రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని