logo

ఆశలన్నీ కేసీఆర్‌ బస్సుయాత్రపైనే..!

సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్‌ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది.

Published : 26 Apr 2024 03:36 IST

నేడు మహబూబ్‌నగర్‌లో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌
27న నాగర్‌కర్నూల్‌లో పర్యటన

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్‌ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వ మహబూబ్‌నగర్‌లోని 14 స్థానాల్లో రెండింటిలోనే మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలోని గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో మాత్రమే భారాస గెలిచింది. మిగతా ఐదు స్థానాలు హస్తం పార్టీ ఖాతాలోకి చేరాయి. ఈ సారి రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో భారాస అభ్యర్థులకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్‌, దేశంలో భాజపా అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికలను భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలపైన దృష్టి పెట్టింది. మహబూబ్‌నగర్‌లో సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్‌ కేటాయించగా, నాగర్‌కర్నూల్‌లో మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను బరిలో నిలిపింది. ఈ అభ్యర్థుల ప్రచారానికి కేసీఆర్‌ స్వయంగా వస్తుండటంతో ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్‌నగర్‌లో రోడ్‌ షో ఏర్పాటు చేశారు. మెట్టుగడ్డ, బస్టాండ్‌ మీదుగా క్లాక్‌టవర్‌ వరకు రోడ్డు షో నిర్వహించి అక్కడే కార్నర్‌ మీటింగ్‌కు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. 27న నాగర్‌కర్నూల్‌లో రోడ్డు షో, కార్నర్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండుచోట్ల కేసీఆర్‌ ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేసి పాలమూరులో సత్తా చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.


  • భారాస అధినేత రెండు రోజుల పర్యటనలో ప్రధానంగా ప్రాజెక్టులపైనే ప్రసంగాల్లో ప్రస్తావించే అవకాశాలున్నాయి.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై కేసీఆర్‌ మాట్లాడే అవకాశం ఉంది. పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనపై ప్రధానంగా విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి. భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులపైనా విమర్శలు చేసే అవకాశాలున్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

నాలుగోసారి కలిసి వచ్చేనా..:  మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంపై కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వరసగా గత మూడుసార్లు ఈ స్థానాన్ని భారాస కైవసం చేసుకుంది. 2009లో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్‌ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 2014లో భారాస నుంచి ఎంపీగా జితేందర్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో మన్నె శ్రీనివాస్‌రెడ్డిని బరిలో నిలుపగా 78వేల మోజార్టీతో గెలిచారు. నాలుగోసారి కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు బాధ్యతలను తమపై వేసుకుని ప్రచారం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో 2019లో మొదటిసారి భారాస గెలుపొందింది. ఇక్కడి నుంచి పోతుగంటి రాములు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ రాములు భాజపాలోకి వెళ్లి తన కుమారుడికి టిక్కెట్‌ ఇప్పించుకోవడంతో స్థానిక రాజకీయ పరిణామాలు మారాయి. బీఎస్పీకి రాజీనామా చేసి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ గులాబీ గూటికి చేరి టికెట్‌ తెచ్చుకున్నారు. ఈ స్థానాన్ని రెండో సారి నిలబెట్టుకోవాలని పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. కేసీఆర్‌ రెండు రోజుల బస్సుయాత్ర పర్యటనలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. సాయంత్రం రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లు ఉండటంతో మిగతా సమయాల్లో  నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి అభ్యర్థుల విజయానికి కావాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని