logo

అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం

అభివృద్ధిని వేగవంతం చేస్తూనే  దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అన్నారు.

Published : 26 Apr 2024 03:33 IST

గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌

నాగర్‌కర్నూల్‌ : అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్డుషోలో మాట్లాడుతున్న గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : అభివృద్ధిని వేగవంతం చేస్తూనే  దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో భాజపా రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో ఏ ఆధారం లేని అభాగ్యులకు మోదీ అండగా నిలిచారన్నారు. కోట్లాది మందికి ఉచిత రేషన్‌తో భరోసా కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ కంటే బలమైన నాయకుడు ఎవరూ లేరని, దేశంలో ఆయన గాలి వీస్తోందని, ఈ సారి 400 సీట్లు సాధించి మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. నాగర్‌కర్నూల్‌లో భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ను గెలిపించి మోదీకి బహుమతిగా ఇద్దామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారాసపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి పదేళ్ల సమయం పడితే కాంగ్రెస్‌ పార్టీ పాలనపై కేవలం వంద రోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకాన్ని పకడ్బందీగా అమలు చేయలేదని విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన నిర్మూలన భాజపాతోనే సాధ్యమైందన్నారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు మాట్లాడారు. భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, నియోజకవర్గం ఇన్‌ఛార్జి దిలీపాచారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని