logo

వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం ఆగం

అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 26 Apr 2024 06:42 IST

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి డా.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. గురువారం తన నామినేషన్‌ అనంతరం మహబూబ్‌నగర్‌లోని భారాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు పెడితే ప్రజలు కేసీఆర్‌కే పట్టం కడతారన్నారు. పదేళ్ల భారాస పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు మిషన్‌ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందిందని పేర్కొన్నారు. ఎకరా పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది అధినేత కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తానన్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు కాంగ్రెస్‌ విస్మరించిందని, భవిష్యత్తులో ఆ పార్టీకి మనుగడ ఉండదన్నారు. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. నీళ్ల కోసం మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని తిరుగుతున్నారంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం పాపమేనన్నారు. ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక మహిళలు చెయ్యెత్తితే బస్సులు ఆపకుండా వెళ్లే రోజులు వచ్చాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో స్థానికుడైన భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తేనే నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌, సాట్స్‌ మాజీ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జీసీసీ మాజీ ఛైర్మన్‌ వాల్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని