logo

అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ

దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్‌నగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

Published : 26 Apr 2024 03:26 IST

మాగనూరు మండలం అడవిసత్యవార్‌ గ్రామంలో ప్రచారం చేస్తున్న మహబూబ్‌నగర్‌ భాజపా అభ్యర్థి డీకే అరుణ

కృష్ణా, న్యూస్‌టుడే : దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్‌నగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం మాగనూరు, కృష్ణా మండలాల్లోని గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. గ్యాస్‌కనెక్షన్‌ మొదలు ముద్ర రుణాలు, పంచాయతీలకు నిధులు, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో గ్రామాలకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి కాంగ్రెస్‌ గొడవలు పెడుతోందని ఎద్దేవా చేశారు. ఉచిత బస్సు ఏమోగాని మహిళలు నరకం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డనైన తనను ఆదరించి గెలిపిస్తే ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తానన్నారు. .ఎత్తిపోతల పథకాలు సక్రమంగా నడిచేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. సంక్షేమ పాలనలో ప్రధాని మోదీ ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. ప్రజలను మోసం చేసి, నోటికొచ్చినట్లు మాట్లాడే కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లారో చూశామని, రేవంత్‌రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటారని విమర్శించారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, కొండయ్య, సోమశేఖర్‌గౌడ్‌, అమర్‌దీక్షిత్‌, మజ్జిగ సురేశ్‌: నల్లె నర్సప్ప, ఎంపీపీ శ్యామలమ్మ, అశోక్‌గౌడ్‌, రాఘవేంద్ర, కల్లూరి నాగప్ప తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో భారాస తీర్థం పుచ్చుకున్న జయానందరెడ్డి  అడవిసత్యవార్‌ గ్రామంలో గురువారం డీకే అరుణ సమక్షంలో తిరిగి భాజపాలోకి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు