logo

నిత్యం చదువు.. జీవితాన్ని గెలువు

పుస్తకం, పత్రిక, మ్యాగిజైన్‌  ఏదో ఒకటి ప్రతిరోజూ విద్యార్థులు అరగంటసేపు చదవాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యాసంవత్సర క్యాలెండర్‌లో స్పష్టం చేసింది.

Published : 09 Jun 2023 03:53 IST

న్యూస్‌టుడే- నారాయణపేట టౌన్‌, అచ్చంపేట, కోస్గి :  పుస్తకం, పత్రిక, మ్యాగిజైన్‌  ఏదో ఒకటి ప్రతిరోజూ విద్యార్థులు అరగంటసేపు చదవాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యాసంవత్సర క్యాలెండర్‌లో స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,58,807 మంది విద్యార్థులు కొత్త పాఠకులుగా రూపుదిద్దుకుంటారు. పఠనం వికాసానికి ఎంతగానో దోహదపడుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం.   .పుస్తకాలు  చదివి తమను తాము ఎలా దిద్దుకున్నారో ఉమ్మడి జిల్లాలోని పలువురు పాఠకులు విద్యార్థులకు వివరిస్తున్నారు.

తెలుసుకో...

* పుల్లని పచ్చి నిమ్మకాయ ముక్క అని చదవగానే నిమ్మకాయ లేకపోయినా నోట్లోంచి లాలాజలం ఊరుతుంది. ఆ భావనే శరీరంలో మార్పులను ప్రేరేపిస్తుంది..   అలాగే ‘అనగనగా ఒక రోజు... తెల్లవారు జామున నిద్ర లేచి.. సూర్యోదయం సమయంలో....‘ ఇలా చదవుతుంటే సూర్యోదయం దృశ్యాన్ని తెర మీద చూస్తున్నట్టు అనుభూతి కలగకమానదు..నిత్య పఠనం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతటి మార్పులు వస్తాయో దీన్ని బట్టి తెలుస్తుంది... కొత్త విషయం నేర్చుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

* స్వామి వివేకానంద, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వంటి వ్యక్తులు అధిక సమయం గ్రంథాలయాల్లో గడిపారు. పుస్తకాలు మామూలు వ్యక్తులను అసమాన్యులుగా తీర్చిదిద్దినట్లు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి.      

* చినిగిన చొక్కా  అయినా తొడుక్కో.. కానీ  ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో  అని కందుకూరి వీరేశలింగం చెప్పారంటే పఠనం ఎంతగొప్పదో అర్ధమవుతుంది.

13 ఏళ్ల వరకు బడి అంటే తెలియదు

మాది బల్మూరు మండలం నర్సాయిపల్లి తండాలో నిరుపేద గిరిజన కుటుంబం. చిన్నతనంలో పాఠశాలకు పంపించకుండా పశువుల కాపరిగా పెట్టారు. 13 ఏళ్ల వయసు వరకు బడి ముఖం చూడలేదు. లింగాలలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి భోజనం చేసేందుకు వచ్చి పేపరు చదువుతుండటం నాలో ఆసక్తిని పెంచింది.  పాఠశాలబాట పట్టాను ఉదయం, సాయంత్రం హోటల్‌లో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూనే చదువుపై దృష్టి పెట్టి విద్యావంతుడిగా ఎదిగాను. పాఠశాలలో పుస్తకాలతో పాటు దినపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నా. అక్కడి నుంచి మొదలైన పురోగతి ఎంఏ (ఆంగ్లం), బీఎడ్‌ పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేలా చేసింది. ఇప్పటికీ క్రమం తప్పకుండా పుస్తకాలు రోజూ చదువుతున్నా.. పుస్తకాలు చదివితే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.

ఆర్‌.కృష్ణ, ఉపాధ్యాయుడు, అచ్చంపేట

పఠనంతో దృక్పథం మారింది

పుస్తకాలు చదవకముందు ఆలోచన ఓ పరిమితిలో ఉండేది. కొత్త కొత్తవి చదువుతుంటే పరిధి విస్తరించింది. ఎన్నోలోపాలను సవరించుకుని ముందుకెళ్లడానికి పుస్తకాలు మార్గం చూపాయి మాతృభాషపై మంచి పట్టు వచ్చింది. తెలుగు పండితుడిగా, రచయితగా నిలదొక్కుకున్నాను. ఖాళీదొరికితే ఏదో ఒకటి చదవడమే నా పని. రోజూ ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నానన్న ఆనందం అనిర్వచనీయం.

కె.గౌరీశంకర్‌రావు, ఉపాధ్యాయుడు, మహబూబ్‌నగర్‌  

చదవకుండా బయటకు వెళ్లను

కాలేజీ రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాలు చదటం అలవాటైంది. అది క్రమంగా ఇతర రచయితల పుస్తకాలు చదివేలా చేసింది.. రోజూ ఉదయం విధిగా ఏదోఒకటి చదివి బయటకు వెళ్తాను. సమయం లేకపోతే రాత్రి గంటపాటు చదువుతాను. ఆదివారం పుస్తక పఠనానికి అధిక సమయం కేటాయిస్తాను. జీవిత చరిత్రలు, నవలలు, సమాజం, వ్యాపారం తదితర పుస్తకాలను చదవటంతో చాలా మార్పు వచ్చింది.

సత్య యాదవ్‌, నారాయణపేట.

మానవ విలువలు నేర్పాయి

పుస్తకాలు విలువలను నేర్పుతాయి. తోటి వారిపట్ల ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష పెంపొందించుకునే విధానం నేర్పుతాయి.  ఇంటర్‌ వరకు బలాదూర్‌గా తిరిగాను. ఆ తర్వాత ప్రేమ కథలు, నవలలు చదివేవాడిని. కొన్నాళ్ల తర్వాత ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ పుస్తకం చదివాను. మొదట అర్థం కాకపోవడంతో మూడు సార్లు చదివాను. మనం ఎలా ఉండాలి అన్నది తెలిసింది. నాలో చాలా మార్పులు వచ్చాయి. మానవ సంబంధాలను పెంపొందించుకున్నాను. యుధ్ధన పూడి సులోచన రచించిన జీవన తరంగాలు, నవీన్‌ రచించిన అంపశయ్య, గోపిచంద్‌ అసమర్థుడి జీవనయాత్ర దృక్పథాన్ని మార్చాయి.

సుదర్శన్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు, కోస్గి

విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా మారాలి

విద్యార్థులు ప్రతి రోజూ చదవడం, అవగాహన చేసుకోవడం, అనర్గళంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అందుకు నిత్యం స్వతంత్ర పాఠకునిగా మారాలి. విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరంలో అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు 30 నిమిషాలు చదివేలా ప్రణాళిక రూపొందించింది. ఇందువల్ల సెల్‌ఫోను, టీవీలకు దూరంగా ఉండగలుగుతారు. ఇదే తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, వారికి జీవితంలో ఉపయోగపడే, వారికి ఆసక్తి ఉన్న పుస్తకాలను కొనుగోలు చేసి అందించాలి. ఇంట్లో చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి.

ఈడీ మధుసూధన్‌రెడ్డి, రాష్ట్ర రిసోర్స్‌ గ్రూప్‌ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని