logo

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

ఈ ఏడాది తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా నదిలో నీటి వినియోగం పెరిగింది. మిషన్‌ భగీరథ ద్వారా మరో రెండు నెలల వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది.

Updated : 27 Mar 2024 05:41 IST

పాత బోర్లకు మరమ్మతులు

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : ఈ ఏడాది తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా నదిలో నీటి వినియోగం పెరిగింది. మిషన్‌ భగీరథ ద్వారా మరో రెండు నెలల వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. గ్రామాల్లోని పాత బోరు బావులు, మోటార్లు మరమ్మతులు చేసే ప్రక్రియ మొదలైంది. నీటి ఎద్దడి అధిగమించేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు సైతం మంజూరయ్యాయి. వాటితో గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో మిషన్‌ భగీరథ ఈఈ శ్రీధర్‌రావు వెల్లడించారు.

ప్రశ్న : వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎద్దడి నివారణకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు.?

జవాబు : కృష్ణానదిలో ఉన్న నీటి నిల్వను బట్టి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అవుతోంది. ప్రత్యామ్నాయంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామాల్లో ఉన్న నీటి వనరులను గుర్తించాం. 61 చేతి పంపులు, సింగిల్‌ ఫేజ్‌ మోటార్లు 565, త్రీఫేజ్‌ మోటార్లు 335, చిన్న పైపులైన్ల మరమ్మతులు 217 చోట్ల ఉన్నట్లుగా గుర్తించాం. పైపులైన్ల మరమ్మతులు చాలా వరకు పూర్తి చేశాం. బోరుబావుల్లో ఉన్న మోటార్లు, చేతిపంపుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నాం. పదిహేను రోజుల్లో పూర్తవుతాయి.

ప్ర : తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు ఏమైనా మంజూరయ్యాయా?

జ : వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల నుంచి రూ.5 కోట్లు వచ్చాయి. వాటితో పాటు ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.3.95 కోట్లు జిల్లాకు వచ్చాయి. వాటితో మరమ్మతు  పనులు చేపట్టాం. వీటితో పాటు గ్రామ పంచాయతీల్లో ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కొన్ని నిధులను వాడుకోవాలని ఆదేశాలు వచ్చాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారులకు సూచనలు చేశాం.

ప్ర : కృష్ణానదిలో తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లున్నాయా, అవి ఎప్పట్టి వరకు వచ్చే అవకాశం ఉంది.

జవాబు: కృష్ణానదిలో తాగునీటి అసవరాలకు సరపడ నీళ్లు ప్రస్తుతం ఉన్నాయి. కాని  ఆంద్రప్రదేశ్‌ వైపున సాగునీటికి నీటిని వదులుతున్నారు. దింతో ఇక్కడ తాగునీటికి కొంత ఇబ్బంది వస్తూంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో 45 రోజుల నుంచి 60 రోజుల వరకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఎంతవరకు నీళ్లు పూర్తి స్థాయిలో వస్తాయనేది కచ్చితంగా చెప్పలేం.

ప్ర : గ్రామాల్లో పాత బోరుబావులకు మరమ్మతులు చేయటం లేదు. మరమ్మతుల పేరుతో నిధుల దుర్వినియోగాన్ని ఎలా నివారిస్తారు.?

జ : గ్రామాల్లోని ప్రత్యేకాధికారులతో పర్యవేక్షణ చేస్తాం. నిధుల దుర్వినియోగానికి ఆస్కారం లేదు. ముందుగానే పాత బోరుబావులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలాంటి సమస్య ఉంది? ఎంత ఖర్చవుతుందనేది అంచనా వేస్తున్నాం. వాటి ఆధారంగానే బిల్లుల చెల్లింపులు చేస్తాం.. నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మరమ్మతులు చేయాల్సిన బోర్లు ఉంటే ఏఈల దృష్టికి తేవాలి.

ప్ర : నల్లమల్లలోని చెంచులకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా కావడం లేదు. ప్రత్యామ్నాయంగా తాగునీరు ఎలా అందిస్తారు.?

జ : నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచులకు తాగునీరు అందించేందుకు ఐటీడీఏతో కలిసి పనిచేస్తున్నాం. అక్కడ 14 చెంచు పెంటలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈర్లపెంట, అప్పాపూర్‌పెంట, మేడిమాల్కల పెంటలో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. మిగతా చెంచు పెంటల్లో సోలార్‌ ద్వారా మోటార్లు పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులతోనూ సమీక్షిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని