logo

నాగర్‌కర్నూల్‌ స్థానాన్ని గెలిచి కానుకగా ఇస్తాం

భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని పార్లమెంట్‌ సభ్యుడు పి.రాములు అన్నారు.

Published : 28 Mar 2024 04:35 IST

పార్లమెంట్‌ సభ్యుడు పి.రాములు

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రాములు, కార్యకర్తలకు నమస్కరిస్తున్న అభ్యర్థి భరత్‌ప్రసాద్‌

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని పార్లమెంట్‌ సభ్యుడు పి.రాములు అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయిదేళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మించడం దేశ ప్రజానికం గర్వించతగ్గ విషయమన్నారు. భారతదేశంలో సుభిక్షమైన పాలన అందిస్తుండటంతో ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయన్నారు. భాజపా అభ్యర్థి భరత్‌ప్రసాద్‌కు గతంలో జడ్పీ ఛైర్మన్‌ పదవి దక్కకుండా అడ్డుపడిన సైంధవుడికి ప్రజల తగిన బుద్ధి చెప్పారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలు ప్రణాళికతో పనిచేయాలని, కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి భాజపా అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

భాజపా అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. గతంలో అచ్చంపేటలో జరిగిన భారాస సమావేశంలో కుర్చీ కూడా ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సార్లు జడ్పీ ఛైర్మన్‌ పదవి దక్కకుండా అడ్డుపడిన వ్యక్తి కనుమరుగయ్యాడని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌, ఎంపీ (నాన్న) రాములు స్ఫూర్తితో అచ్చంపేట అభివృద్ధే ధ్యేయంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. గతంలో 5 రోజులు ఎదురు చూసినా మాజీ సీఎం కేసీఆర్‌ ను కలిసే అవకాశం వచ్చేది కాదని, అనుకోకుండా ప్రధాని మోదీతో కలవడంతో జన్మకు సార్థకత లభించిందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అద్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ కేసీఆర్‌ కాళ్ల వద్ద ఊడిగం చేయడం సిగ్గుచేటని బీసీ జాతీయ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, నేతలు నరేందర్‌రావు, బాలాజీ, గోపాల్‌యాదవ్‌, మంగ్యానాయక్‌, రేణయ్య, జానకి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని