logo

‘అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్‌ పేర్కొన్నారు.

Published : 24 Apr 2024 06:12 IST

మాట్లాడుతున్న దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్‌, వేదికపై భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, దళిత మోర్చా నాయకులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన భాజపా దళిత మోర్చా నాయకుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్‌ ఎస్సీలను రాజకీయ లబ్ధికి వాడుకున్నదే తప్పా అంబేడ్కర్‌ ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో ఆచరణలో పెట్టలేదని విమర్శించారు. పదేళ్ల క్రితం అధికారం చేపట్టిన మోదీ దేశంలోని అణగారిన దళితుల అభ్యున్నతికి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలతో సమానంగా దళితులకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. దళిత బిడ్డలు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకం పేరుతో రూ.20లక్షల ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి దళిత కుటుంబం భాజపా అభ్యర్థి విజయానికి అండగా నిలవాలని కోరారు. భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను ప్రతి పార్టీ దళితుల ఓట్ల కోసం వాడుకుందే తప్పా ఆయన ఆశయాల సాధనకు కృషిచేయలేదన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశంలో అన్ని కులాలు, మతాల వాళ్లు ఆర్థిక, సామాజికంగా ఎదిగేలా పనిచేస్తోందన్నారు. వికసిత్‌ భారత్‌ మోదీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మోదీని మూడో సారి ప్రధానమంత్రిని చేయడం కోసం దళితమోర్చా ఆధ్వర్యంలో దళితుల ఓట్ల సాధనకు క్షేత్రస్థాయిలో శ్రమించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఇంటింటికి వెళ్లి పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు వివరించాలని డీకే అరుణ కోరారు. సమావేశంలో దళితమోర్చా పార్లమెంట్‌ స్థానం ఇన్‌ఛార్జి విజయ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు కొండయ్య, ఎడ్ల కృష్ణయ్య, భరత్‌భూషణ్‌, సాయిరాం, జిల్లా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్‌, ఉపాధ్యక్షుడు శ్రీరాములు, పి.చెన్నయ్య, ఎం.రాము, ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని