logo

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర

భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్‌గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.

Updated : 06 May 2024 07:01 IST

జన జాతర సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ
బంగ్లా రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకాలి: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ఈనాడు, మహబూబ్‌నగర్‌ : భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్‌గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడారు. చిన్న సైజ్‌ పుస్తకాన్ని తీసుకొచ్చి సభలో చూపుతూ దాని గురించి వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ, బంగ్లా రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. పొద్దున చేరో పార్టీలో ఉంటారు.. రాత్రి అయిన తర్వాత ఇద్దరూ ఒక్కటై ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడగొట్టారన్నారు. అదే బంగ్లా రాజకీయం ఇప్పటికీ ఈ ప్రాంతంలో నడుస్తోందన్నారు. ఈ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలికి నడిగడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని చెప్పాలన్నారు. 70 ఏళ్ల తర్వాత మన పాలమూరుకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిందన్నారు. మన ప్రాంతంలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి   కాంగ్రెస్‌కి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ని ఓడించాలని బంగ్లా వాళ్లు అంటున్నారు. డీకే అరుణను జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు.. భరతసింహారెడ్డి ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ని అడ్డం పెట్టుకుని దందాలు చేసి రూ.కోట్లు సంపాదించలేదా? అన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ని ఓడించాలని బంగ్లా మనుషులు కుట్రలు చేస్తున్నారని వాటిని  ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపిస్తేనే నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కృష్ణా, తుంగభద్ర మధ్యలో ఉండే నడిగడ్డ పౌరుషానికి, ఇచ్చిన మాట నిలబెట్టడానికి పెట్టింది పేరని మాట ఇస్తే తల తెగినా.. కిందపడ్డా నిలబెట్టుకునే బిడ్డలు ఈ ప్రాంత ప్రజలన్నారు. నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పదేళ్లలో భారాస ప్రభుత్వం పాలమూరులో కృష్ణా నది నుంచి చుక్క మంచినీరు కూడా ఇవ్వలేదన్నారు. శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌తోపాటు ఇటీవల ప్రారంభించిన నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయన్నారు. భారాసకు బుద్ధి చెప్పడానికి నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, జాతీయ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరుతున్న రాహుల్‌గాంధీ, వేదికపై భట్టివిక్రమార్క, దీపాదాస్‌మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, రోహిత్‌చౌదరి, జూపల్లి కృష్ణారావు, తిరుపతయ్య, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి

ఎన్నికలు చరిత్రాత్మకం కావాలి: మంత్రి జూపల్లి

ఇటిక్యాల, మానవపాడు, న్యూస్‌టుడే: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబ రుణం తీర్చుకునే అవకాశం ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయని, ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌కి ఓటు వేయాలన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసి, దేశాన్ని సంఘటితం చేస్తూ దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. సోనియా కుటుంబం త్యాగాల కుటుంబమని అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో రాహుల్‌ గాంధిని ప్రధానమంత్రిగా చేస్తే దేశంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ... ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ఆరుగ్యారంటీలతో పాటు కేంద్రంలోని ఐదు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. గుడికి వెళ్లినట్లుగానే ఈ నెల 13న పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేస్తానన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా పనిచేస్తోందన్నారు. భారాస పార్టీ నేతలు మతిభ్రమించి పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నడిగడ్డ ప్రజల పౌరుషాన్ని పార్లమెంటు ఎన్నికలలో చూపించి ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని