logo

బడి బాగుకు రూ.8.71 కోట్లు

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.8.71 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేసే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.

Published : 06 May 2024 04:54 IST

పనులు ప్రారంభించిన అమ్మ ఆదర్శ కమిటీలు

తుమ్మపల్లి పాఠశాలలో పనుల వివరాలు సేకరిస్తున్న పీఆర్‌ ఏఈ

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.8.71 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేసే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. గత నెల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ అధికారులు, పట్ణణ ప్రాంతాల్లో పురపాలిక అధికారులు, పీఆర్‌ అధికారులు కలసి అవసరమైన పనులు చేసేందుకు ప్రతిపాదనలు అందించగా, జిల్లా కలెక్టర్‌ వాటికి ఆమోదం తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న సర్కారు బడులు బాగుపడనున్నాయి.

కేటాయింపులు ఇలా..: జిల్లాలో మొత్తం 465 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అన్ని పాఠశాలల్లోనూ 15 మందితో కూడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. చాలా పాఠశాలల్లో తాగునీరు, పైకప్పు పెచ్చులూడటం, విద్యుత్తు లేకపోవడం, కిటికీలు, తలుపులు లేక విద్యార్థులు ఇబ్బందుల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. ఇలా మొత్తం 13 మండలాలు, నాలుగు పురపాలికల్లో 298 పాఠశాలల్లో సమస్యలను గుర్తించారు. ఈ పాఠశాలల్లో తాగునీటి సరఫరా, తరగతి గదులు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుత్తు తదితర సమస్యలను పరిష్కరించేందుకు రూ.8.71 కోట్ల నిధులు మంజూరయ్యాయి.ఇందులో మొదటి విడతగా రూ.2.17 కోట్లు విడుదల చేయగా, 51 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఛైర్మన్లు పనులు చేపడుతున్నారు. జూన్‌ 10వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి చేయాలనే ఆదేశాలుండటంతో, ఆ దిశగా పీఆర్‌ అధికారులు చర్యలుచేపడుతున్నారు.

మన ఊరు - మనబడి సంగతేంటి : అమ్మ ఆదర్శ కమిటీలలో పనులు చేపడుతున్న అధికారులు, గతేడాది నుంచి చేపడుతున్న మన ఊరు మన బడి పనులపై దృష్టి సారించడం లేదు. మొత్తం 161 పాఠశాలలు ఈ కార్యక్రమానికి ఎంపికవగా, బిల్లులు రావడం లేదంటూ కొన్ని నెలలుగా పాఠశాలల్లో గుత్తేదార్లు పనులు చేయడం లేదు. ఇప్పటి వరకు 16 పాఠశాలలు మాత్రమే అధికారికంగా ప్రారంభించగా, మరో 33 చోట్ల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో వీటి పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

సమయంలోగా పనులు పూర్తి : జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాం. పనులు చేసేందుకు 40 రోజుల సమయం ఉంది. సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, సమీక్షిస్తాం. పూర్తయితే చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయి.

ఇందిర, జిల్లా విద్యాధికారి, జోగులాంబ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని