logo

అందని బిల్లులు.. అయోమయంలో రైతులు

జహీరాబాద్‌ ప్రాంతంలోని చెరకు రైతులకు బిల్లుల కోసం ఈ ఏడాదీ ఎదురుచూపులు తప్పటం లేదు. సీజన్‌ ముగిసి రెండు, మూడు నెలలు కావస్తోంది. కొందరికి ఇంకా పంట విక్రయానికి సంబంధించిన డబ్బు అందలేదు. ఏప్రిల్‌ 22న నిర్వహించిన ప్రత్యేక....

Published : 21 May 2022 01:26 IST

న్యూస్‌టుడే, జహీరాబాద్‌

గడువు దాటినా విడుదల చేయని చక్కెర మిల్లు యాజమాన్యం  

హీరాబాద్‌ ప్రాంతంలోని చెరకు రైతులకు బిల్లుల కోసం ఈ ఏడాదీ ఎదురుచూపులు తప్పటం లేదు. సీజన్‌ ముగిసి రెండు, మూడు నెలలు కావస్తోంది. కొందరికి ఇంకా పంట విక్రయానికి సంబంధించిన డబ్బు అందలేదు. ఏప్రిల్‌ 22న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మే 15లోపు మొత్తం చెల్లిస్తామని మిల్లు యాజమాన్యం ప్రకటించింది. ఆ గడువు దాటి  ఐదు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదు. రూ.10.76 కోట్ల బకాయిలు ఉండగా, శుక్రవారం నాటికి కేవలం రూ.కోటి మాత్రమే చెల్లించింది.

అప్పులు తీర్చలేక...
ఇంతవరకు చేతికి బిల్లులు అందక పోవడంతో పంట పెట్టుబడులకోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. వడ్డీల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారం పదిరోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతోంది. పెట్టుబడుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

ఏటా ఇదే తంతు
జహీరాబాద్‌ సమీపంలోని ట్రైడెంట్‌ కర్మాగారం పరిధిలోని రైతులకు ఏటా బిల్లుల సమస్య వెంటాడుతూనే ఉంది. గానుగ ప్రారంభంలో సకాలంలో చెల్లిస్తున్న యాజమాన్యం, చివరి విడతల్లో చెరకు విక్రయించిన రైతులకు చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. నిబంధనల ప్రకారం కర్మాగారానికి చెరకు అందించిన 15 రోజుల్లో డబ్బు చెల్లించాలి. దాదాపు మూడు నెలల క్రితం సరఫరా చేసిన వారికి నేటికీ అందలేదు. 2021-22 గానుగ సీజన్‌కు సంబంధించి ట్రైడెంట్‌లో 2021 డిసెంబరు 10 నుంచి 2022 మార్చి 9 వరకు గానుగాడించారు. 2151 మంది రైతులకు చెందిన 2.07 లక్షల టన్నుల చెరకును యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం రూ. 63.76 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1800 మందికి దాదాపు రూ.54 కోట్లు చెల్లించినట్లు చక్కెర శాఖ అధికారుల రికార్డులను బట్టితెలుస్తోంది. యాజమాన్యం సకాలంలో డబ్బు ఇవ్వడం లేదని పలువురు రైతులు మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు. మంత్రి ఆదేశాల మేరకు సీడీసీ ఛైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 22న జహీరాబాద్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బకాయిలను మే 15వ తేదీ నాటికి చెల్లిస్తామని ట్రైడెంట్‌ అధికారులు ప్రకటించినా ఆచరణలో నెరవేరలేదు.  


ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం
రాజశేఖర్‌, చక్కెర శాఖ జిల్లా సహాయ కమిషనర్‌

రైతులకు బిల్లులు ఇప్పించేందుకు నిరంతరం కర్మాగారం యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాం. అవసరమైతే చట్టపరంగా తీసుకోవాల్పిన చర్యలపై సమాలోచన చేస్తున్నాం. ఇప్పటికే యాజమాన్యానికి తాఖీదులు జారీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని