logo

ఫొటోలు మార్చేసి... స్థలాలు కొట్టేశారు!

దివ్యాంగులకు వచ్చిన ఇంటి స్థలాలను వారికి తెలియకుండానే కొందరు కాజేశారు. కేటాయింపు కోసం అవసరమైన అన్ని పత్రాలను వారి నుంచి సేకరించిన వీరు... చివరకు స్థలాలు ఇచ్చారనే సమాచారం కూడా వారికి చేరకుండా జాగ్రత్త పడ్డారు. అధికారులు

Published : 21 May 2022 01:26 IST

దివ్యాంగులకు ఇవ్వాల్సిన పత్రాలను దగ్గరపెట్టుకొని దందా
పట్టాలొచ్చాయని లబ్ధిదారులకు తెలియకుండా జాగ్రత్తలు
ఈనాడు, సంగారెడ్డి

దివ్యాంగులకు వచ్చిన ఇంటి స్థలాలను వారికి తెలియకుండానే కొందరు కాజేశారు. కేటాయింపు కోసం అవసరమైన అన్ని పత్రాలను వారి నుంచి సేకరించిన వీరు... చివరకు స్థలాలు ఇచ్చారనే సమాచారం కూడా వారికి చేరకుండా జాగ్రత్త పడ్డారు. అధికారులు ఇచ్చిన నివేశన స్థలాల ధ్రువీకరణ పత్రాలను వారి వద్దే ఉంచుకొని దందాకు తెరలేపారు. తమకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికి వాటిని అందించారు. ఇవ్వలేనోళ్లకు అసలు విషయమే తెలియనివ్వలేదు.  ధ్రువీకరణ పత్రాలపై ఫొటోలను తొలగించి... తమకు నచ్చిన వారికి అమ్మేసుకున్నారు. కంది మండల కేంద్రంలోని సర్వే సంఖ్య 615లో దివ్యాంగులకు కేటాయించిన ఇంటిస్థలాల్లో జరిగిన భారీ అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ 2003లో 126 మందికి ఒక్కొక్కరికి 100గజాల చొప్పున అందించారు. చాలా మందికి తమకు స్థలం వచ్చిన విషయం కూడా తెలియకపోవడం జరిగిన మోసానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ వంద గజాల స్థలం రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. దాదాపు రూ.8-9 కోట్ల విలువైన స్థలాల విషయంలో అక్రమాలు జరిగినట్లు బాధితులు చెబుతున్నారు.


* నివేశన స్థల పత్రం నకలును చూపుతున్న ఈ మహిళ పేరు ఫర్జానా బేగం. కంది మండలంలోని సర్వే సంఖ్య 615లో 100 గజాల స్థలాన్ని  కేటాయించారు. ఈ విషయం మొన్నటి వరకు ఆమెకు తెలియదు. తాను దరఖాస్తు చేసుకున్నా... అధికారులు ఇవ్వలేదని అనుకుంటూ వచ్చారు. తనకూ స్థలం ఇచ్చారని, తన ఫొటో తొలగించి వేరే వారి ఫొటో అతికించారని తెలుసుకొని ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఫర్జానాబేగం ధ్రువీకరణ పత్రం సాయంతో ఇంటిస్థలాన్ని ఒకరు విక్రయించారు. దివ్యాంగులకు ఇంటిస్థలాల పేరిట కొందరు సాగించిన దందాకు ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ.


అధికారుల నిర్లక్ష్య వైఖరి
దివ్యాంగుల కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో భారీ అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు అందాయి. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మొగులయ్య ఇటీవల ప్రజావాణికి వచ్చి తన బాధను వివరించారు. పట్టా ధ్రువపత్రం ఉన్నా... తన స్థలాన్ని ఒక మహిళ ఇతరులకు అమ్మేసుకున్నారని ఉన్నతాధికారులకు తెలిపారు. కంది మండలం జుల్‌కల్‌ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఫర్జానా బేగం పేరిట వచ్చిన ధ్రువపత్రంలో ఆమె ఫొటోను తొలగించి... మరోమహిళ ఫొటో అతికించి స్థలాన్ని అమ్మేసుకున్న ఉదంతమూ అధికారుల దృష్టికి వచ్చింది.  ఇప్పటి వరకు సమగ్ర విచారణ దిశగా అధికారులు దృష్టిసారించలేదు. కనీసం గతంలో ఎవరెవరికి వాస్తవంగా కేటాయించారు? ఇప్పుడు ఆయా స్థలాల్లో ఎవరుంటున్నారనే విషయం తేల్చినా అక్రమం బహిర్గతమవుతుంది. ఇదే విషయమై కంది మండల తహసీల్దారు విజయలక్ష్మిని అడగ్గా... కేటాయింపులకు సంబంధించిన దస్త్రం దొరకడం లేదని సమాధానమిచ్చారు. వెతికే పనిలో తమ సిబ్బంది నిమగ్నమయ్యారని వివరించారు.


అవసరమైన పత్రాలన్నీ అందించాం
- ముత్తంగి శివలీల, జుల్‌కల్‌, కంది మండలం

కందిలో దివ్యాంగుల కోసం లేఅవుట్‌ చేస్తున్నారని ఒక మహిళ మా వద్దకు వచ్చారు. ఇంటి స్థలం వస్తుందని నాతో చెప్పారు. దీంతో సదరంతో పాటు ఇతర ధ్రువపత్రాలు, నామమాత్ర రుసుం ఆమె చేతిలో పెట్టా. ఆ తర్వాత మాకు అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. మా పేరుతో ఇంటిస్థలాలు వచ్చాయని చాలా మంది చెప్పారు. ఇదే విషయమై అధికారులను అడిగినా.. ఎవరూ పట్టించుకోలేదు. మా గ్రామంలో కొందరి పేర్లతో వచ్చిన ధ్రువీకరణ పత్రాలపై ఉన్న ఫొటోలు తీసేసి... వేరేవాళ్లకు మా స్థలాలు అమ్మినట్లు తెలుస్తోంది. అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని