logo

సంస్కృతిని ప్రతిబింబించేలా.. ఔన్నత్యాన్ని చాటేలా..

బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మను రూపొందించి తమ ఇంటి దేవతగా కొలుస్తారు. కూడళ్లలో సామూహికంగా ఆడిపాడి సంబరాలు నిర్వహిస్తారు.

Published : 03 Oct 2022 00:45 IST

పాటల సీడీ ఆవిష్కరణలో..

తుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మను రూపొందించి తమ ఇంటి దేవతగా కొలుస్తారు. కూడళ్లలో సామూహికంగా ఆడిపాడి సంబరాలు నిర్వహిస్తారు. తెలంగాణలో విశిష్ట స్థానం ఉన్న బతుకమ్మపై ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన పలువురు పాటలు రాసి బాణీ కట్టగా, కొంతమంది పరిశోధనలు చేశారు. మరికొందరు లఘుచిత్రాలు తీసి ఔన్నత్యాన్ని చాటడం విశేషం.


విశేషాలు తెలిసేలా..

చేర్యాల: చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన తాటికొండ విష్ణుమూర్తి బతుకమ్మపై పరిశోధన చేసి విశేషాలను, ఔన్నత్యాన్ని చాటే తీరు, పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలన్న అంశాలతో ఓ పుస్తకాన్ని వెలువరించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా, తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలపై పుస్తకంలో వివరించారు. ప్రత్యేకంగా పాటలపై పరిశోధన చేశారు. ఈ పండగకు, జీవన విధానానికి ఉన్న అనుబంధాన్ని క్షుణ్నంగా విపులీకరించారు. గ్రామీణ మహిళలు పాడుకునే పాటల్లోని అలంకారాలు, సామెతలు, జాతీయాలు, నుడికారాలు, వర్ణాలను పుస్తకంలో పొందుపర్చారు.


పాట.. బాణీ కట్టి..

జహీరాబాద్‌ అర్బన్‌: ‘బతుకమ్మ పండగ వేళ అంతా మేలుకున్నరే.. వాకిట్లో కళ్లపి చల్లి ముగ్గులేసిరే’ ఆంటూ పూల పండగ ప్రాధాన్యాన్ని వివరిస్తూ జహీరాబాద్‌కు చెందిన ప్రముఖ గజల్‌ గాయని డా.స్వరూపారెడ్డి వీడియో ఆల్బమ్‌ను రూపొందించారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల ఆత్మీయత, తీరొక్క పూలతో తయారు చేసే బతుకమ్మ విశేషాలను వివరిస్తూ పాటను రూపొందించారు. దీన్ని ఇటీవల మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించగా.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. మంచి ఆదరణ వస్తోంది. ఇకపై ఏటా బతుకమ్మ వేడుకలపై పాటల వీడియో చిత్రీకరించనున్నట్లు స్వరూపారాణి చెప్పారు.


చిత్రీకరించి..

హుస్నాబాద్‌ గ్రామీణం: పూల పండగ విశిష్టతను చాటిచెప్పేలా హుస్నాబాద్‌ మండలం తోటపల్లికి చెందిన అమూల్య విశేష కృషి చేస్తున్నారు. ఈమె మంచి గాయకురాలు కావడంతో.. బతుకమ్మ పండగ కోసం ఓ పాట పాడింది. దీనికి సంబంధించి స్వగ్రామంలో పాటను గ్రామస్థులతో కలిసి చిత్రీకరించి యూట్యూబ్‌లో పొందుపర్చారు. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అక్కన్నపేటకు సంబంధించిన దాసరి కృష్ణ లఘు చిత్రాన్ని నిర్మించారు. పండగకు సంబంధించిన ఈయన తీసిన ఫొటోలకు బహుమతులు లభించాయి.


రచనలు చేస్తూ..

బొంరాస్‌పేట: బొంరాస్‌పేట మండలం రేగడిమైలారానికి చెందిన అంజిలప్ప ఎంఏ తెలుగు పూర్తిచేశారు. ఈయనకు కళలపై ఉన్న ఆసక్తితో అటు దిశగా అడుగేసి ప్రశంసలు అందుకుంటున్నారు. 2018 నుంచి బతుకమ్మ పాటలు రాస్తూ చిత్రీకరిస్తున్నారు. వాటిని యూట్యూబ్‌, సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు 13 పాటలు పండగ విశిష్టతను చాటేలా స్థానిక కళాకారులతో కలిసి వాటి వీడియోలను చిత్రీకరించారు. అంజిలప్ప స్వయంగా సంగీతాన్ని జోడించి ఉత్సాహపరిచేలా రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని