logo

ఆహ్లాదం కనం.. ఆక్రమణలు నిజం!

పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు కోమటికుంటను సుందరీకరించాలని గతంలో నిర్ణయించారు. ఇందుకోసం రూ.40 లక్షలు అవసరమని మూడేళ్ల కిందట ప్రతిపాదనలు పంపారు.

Published : 06 Feb 2023 01:45 IST

నర్సాపూర్‌లోని కోమటికుంట

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు కోమటికుంటను సుందరీకరించాలని గతంలో నిర్ణయించారు. ఇందుకోసం రూ.40 లక్షలు అవసరమని మూడేళ్ల కిందట ప్రతిపాదనలు పంపారు. అయితే ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై దృష్టి సారించకపోవడంతో ఎక్కడికక్కడే అన్నట్లుగా ఉంది

వంద ఎకరాల సాగు

కుంట కింద గతంలో వంద ఎకరాలు సాగయ్యేవి. రానురాను పట్టణం విస్తరించడంతో పొలాలు ప్లాట్లుగా మారిపోయి ఆయకట్టు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కింది భాగంలో ఇళ్లు నిర్మించుకోవడంతో, కట్టమీదుగానే రోడ్డు నిర్మించారు.  కుంటలో నాచు పేరుకుపోయి ప్రమాదకరంగా మారింది. నీటి వినియోగం లేకపోవడంతో సమీపంలో నివాసం ఉన్న  వారు చెత్త వేస్తున్నారు. పురపాలిక సిబ్బంది సేకరించిన చెత్తను కూడా ఇందులోనే వేయడంతో మరింత అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించి ముక్కుపుటాలు అదురుతున్నాయి.

అనుమతి లేకుండా  ఏర్పాటు చేసిన షెడ్డు

అక్రమార్కుల కన్ను

కుంట స్థలం జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. క్రమంగా మొరం పోస్తూ ఆక్రమించేందుకు ప్రయత్న చేస్తున్నారు. కొందరు దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు స్థలాన్ని కబ్జాచేసి తాత్కాలిక షెడ్లను వేసి అద్దెలు వసూలు చేయడం గమనార్హం. కుంట కింద ప్రస్తుతం 25 ఎకరాల భూములు సాగవుతున్నాయి. 11 ఎకరాల వరకూ ఎఫ్‌టీఎల్‌ విస్తరించి ఉంది. 30 ఎకరాల శిఖం కలిగి ఉంది.  శిఖాన్ని కూడా అన్యాక్రాంతం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఆక్రమణలకు గురి కాకుండా కంచెను ఏర్పాటు చేసి, సుందరీకరించాలని కోరుతున్నారు.


నిధులు కేటాయించగానే
- మణిభూషణ్‌, ఏఈ నర్సాపూర్‌

మిషన్‌ కాకతీయ అయిదో విడతలో ప్రతిపాదనలు తయారుచేసి పంపించాం. ఇంతవరకు నిధుల కేటాయింపులు లేక పనులు చేపట్టలేకపోయాం. ఆక్రమణ మాదృష్టికి రాలేదు. విచారించి తగిన చర్యలు తీసుకుంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని