logo

ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం

‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి.

Published : 29 Mar 2024 03:32 IST

పచ్చదనంపై మరింత అవగాహన అవశ్యం
సీనియర్‌ శాస్త్రవేత్త సుధాకర్‌రెడ్డి
న్యూస్‌టుడే, సిద్దిపేట

‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. తద్వారా వాతావరణంలో సమతుల్యత సాధ్యం’ అని ఇస్రో అనుబంధ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌) సీనియర్‌ శాస్త్రవేత్త చింతల సుధాకర్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించగా వివిధ అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు ఇదే కళాశాలలో చదివి ప్రస్తుతం శాస్త్రవేత్తగా విద్యార్థులకు మార్గదర్శనం చేయడం గొప్ప అనుభూతిని ఇస్తోందన్నారు. ప్రకృతిహితాన్ని కాంక్షిస్తూ అందరూ సమష్టిగా ముందడుగు వేయాలని సూచించారు.

అటవీ శాఖను అప్రమత్తం చేస్తున్నాం..

పదేళ్ల కిందటితో పోలిస్తే అడవుల్లో పచ్చదనం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వాలు ఈ దిశగా అడుగేయం శుభపరిణామం. అటవీశాఖతో పాటు ప్రజలు మొక్కల సంరక్షణ క్రతువులో పాలుపంచుకోవడం విశేషం. అటవీ సంపద, విస్తీర్ణాన్ని సంరక్షించుకోవాలి. ఇందుకు ఇస్రో సాంకేతికత దోహదపడుతుంది. వాతావరణంలో వచ్చే మార్పులను సులువుగా తెలుసుకునే వెసులుబాటు మాకు ఉంది. దీనిపై కేంద్రానికి నివేదిస్తుంటాం. అడవుల్లో మంటలు, కార్చిచ్చు వంటివి సంభవిస్తే ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియాకు సమాచారం చేరవేస్తాం. వారు అటవీ శాఖను అప్రమత్తం చేస్తుంటారు.


నిరంతర పరిశ్రమతోనే ఎదిగా..

నిరంతర పరిశ్రమతో ఆసక్తి ఉన్న విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగవవచ్చు. భవిష్యత్తు అంతా పరిశోధన రంగంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలు అనేకం ఉన్నాయి. ప్రతి విద్యార్థి ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. మేం చదువుకునే సమయంలో వనరులు తక్కువే. సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. శాస్త్రీయత, నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తూ ముందడుగు వేస్తే శాస్త్రవేత్తగా ఎదగవచ్చు. ఇందుకు సరైన మార్గదర్శనం ఉండాలి. సంకల్పం గొప్పదైతే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.


స్వస్థలం ఇక్కడే..

మా స్వస్థలం చేర్యాల మండలం ముస్త్యాల. 1991-94 వరకు సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ బీజడ్‌సీ చదివా. ఉస్మానియాలో ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం), కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేశా. పరిశోధనలంటే ఆసక్తి. అలా 2001 నుంచి శాస్త్రవేత్తగా స్థిరపడ్డా. ప్రపంచంలో టాప్‌-2 శాతం శాస్త్రవేత్తల్లో ఒకరిగా నాలుగేళ్లుగా కొనసాగుతున్నా. సిద్దిపేట కళాశాలలో నేర్చుకున్న అంశాలు ఈ స్థాయిలో నిలిచేందుకు దోహదం చేశాయి. అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం సంబంధిత అంశాలపై ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మా బృందం విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తుంటాం. పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేస్తుంటాం.


అసమతుల్యతకు కారణాలు..

వాతావరణంలో అసమతుల్యతకు అడవుల్లో చెట్ల నరికివేత, నగరీకరణ, కాలుష్యం కారణాలు. సమతుల్యతకు నిరంతరాయంగా శ్రమించాలి. 1992లో జరిగిన ఎర్త్‌ సమ్మిట్‌ ద్వారా సమతుల్యతపై పలు దేశాలు దృష్టి సారించాయి. విభిన్న జాతుల మొక్కలు, వృక్ష, జంతు జాతుల రక్షణతో జీవవైవిధ్యం సాధ్యమవుతుంది. వాటి మనుగడకు ఇబ్బంది కలిగించే చర్యలకు ఉపక్రమించొద్దు. హాని కలిగించే ప్లాస్టిక్‌ వంటి ఉత్పత్తుల వినియోగం తగ్గించాలి. జిల్లాలో వివిధ నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం ద్వారా భవిష్యత్తులో మేలు చేకూరనుంది. ఒకప్పుడు కరవు, కాటకాలు ఎదుర్కొన్న ఈ ప్రాంతంలో నీటివనరుల లభ్యత పెరగడం పర్యావరణానికి మేలు చేసేది. నీళ్ల ద్వారా వివిధ పక్షి, జంతు జాతులు, మత్స్య సంపద వృద్ధి చెందుతుంది. హరితం పెరుగుతుంది. జీవనోపాధి మెరుగవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని