దావత్‌ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ

ఎన్నికల పండుగొచ్చింది.. దావత్‌ల మీద దావత్‌లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు.

Updated : 07 May 2024 08:47 IST

న్యూస్‌టుడే, గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక: ఎన్నికల పండుగొచ్చింది.. దావత్‌ల మీద దావత్‌లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువతకు ఇష్టమైన విందులతో జిల్లాలోని ఫాంహౌజ్‌లు రద్దీగా ఉంటున్నాయి. కొందరు స్థానికులు, హైదరాబాద్‌ జంటనగరాలు, ఇతర పట్టణాలకు చెందిన వ్యాపారులు వారాంతపు సెలవు రోజుల్లో సేదదీరడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ క్షేత్రాలు (ఫాంహౌజ్‌) ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా రాజకీయ వేదికలుగా మారుతున్నాయి. స్నేహితులు, బంధువులు, కార్యకర్తల పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటి సందర్భాలు ఎంచుకొని వ్యవసాయ క్షేత్రాల్లో నాయకులు దావత్‌లు చేపడుతున్నారు. సమావేశమై రాబోయే రోజుల్లో ప్రచార వ్యూహాన్ని అక్కడే చర్చిస్తున్నారు.

సకల సౌకర్యాలతో సేద తీరుతూ..

కార్యకర్తలను ఖుషీ చేయడానికి.. ఉదయం, సాయంత్రం ఇంటింటా ప్రచారం సాగిస్తున్న నేతలు ఇక్కడ మధ్యాహ్నం పూట విందులు చేసుకుంటున్నారు. గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు పట్టణానికి చేరువలో ఉండటంతో ఇక్కడ చాలా చోట్ల రోడ్లకు దగ్గరగా ఫాంహౌజ్‌లున్నాయి. వీటిలో సకల సౌకర్యాలు ఉంటాయి. ఎండ వేడిమి నేపథ్యంలో పొలాల మధ్య సేదతీరేందుకు ఇష్టపడుతున్నారు. పార్టీల వ్యూహ రచనలు బయటకు పొక్కకుండా ఈ క్షేత్రాలు ఉపయోగపడుతున్నాయి. రాజకీయ ప్రముఖులు వచ్చినపుడు విడిది చేస్తున్నారు. కార్యకర్తలు వారిని కలుస్తున్నారు.

కిట్టీ పార్టీల్లోనూ సమీక్ష

సాధారణ రోజుల్లో పైసా ఇవ్వని నాయకులు సైతం విందుల పేరుతో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రోజూ కార్యకర్తలు విందుల్లో తేలియాడుతున్నారు. గజ్వేల్‌లోని ఓ నాయకునికి చెందిన ఫాంహౌజ్‌లో  ఇటీవలే పుట్టిన రోజు వేడుక పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక్కడికి బంధువుల కంటే ఎక్కువగా కార్యకర్తలే హాజరయ్యారు. దుబ్బాకలో ఓ పార్టీకి చెందిన నేత పుట్టిన రోజును పురస్కరించుకుని ఆస్పత్రిల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన తరువాత ఓ ఫాంహౌజ్‌ వద్ద విందు ఏర్పాటు చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే సేద తీరినట్లు స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో కిట్టి పార్టీలు జరుగుతున్నాయి. ఒక్కో పార్టీలో 150 మంది వరకు సభ్యులున్నారు. ప్రతి నెల కొంత నగదు జమ కడుతూ ప్రతి నెల పార్టీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సందర్భాన్ని చూసుకుని రెండ్రోజులకోసారి బృంద సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్నికలపై సమీక్షిస్తున్నారు.

ముందుగానే చెల్లింపులు

పలువురు నేతలు కొన్ని మద్యం దుకాణాలు, బిర్యానీ సెంటర్లకు సరుకు కోసం ముందుగానే చెల్లింపులు చేసినట్టు సమాచారం. మండిపోతున్న ఎండల కారణంగా డిమాండ్‌ పెరగడంతో మద్యం దుకాణాల్లో నిల్వల కొరత ఏర్పడుతోంది. గ్రహించిన నాయకులు ముందుగానే చెల్లింపులు చేస్తున్నారు. గతంలో ఓ దుకాణంలో రోజూ 120 కేసుల మద్యం వచ్చేది. ప్రస్తుతం 40 కేసులే వస్తున్నాయి. వాటినీ ముందస్తు చెల్లింపుదారులకు ఇస్తున్నారు. బిర్యానీ గతంలో 40 నుంచి 60 వరకు పొట్లాలు అమ్ముడయ్యేవి. ప్రస్తుతం 120 వరకు రోజూ సరఫరా చేస్తున్నామని ఓ హోటల్‌ నిర్వాహకుడు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని