logo

రేవంత్‌రెడ్డి.. మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.

Published : 09 May 2024 01:05 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2006లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌ జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. పదవీకాలం పూర్తి కాకుండానే 2007లో ఉమ్మడి పార్టీల మద్దతుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి పోటీగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత తెదేపాలో చేరారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో తెదేపాకు రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట


వేలికి సిరా.. ఓటుకు పక్కా

ఓటరు వేలి మీద సిరా చుక్క పడిందంటే ఓటేసినట్లే లెక్క. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తోంది. పోలింగ్‌ బూత్‌లో ఓటేయగానే ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్క వేస్తారు. చర్మంపై పూసిన ఈ సిరాను త్వరగా తొలగించడానికి సాధ్యపడదు. సిరా పూయగానే 15-30 సెకన్లలో పొడిబారుతుంది. కొన్ని రోజుల వరకు అలాగే ఉంటుంది. మెల్లిమెల్లిగా చెదిరిపోతుంది. ఇందులో సిరా 10 శాతం, 14-18 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ మిళితమై ఉంటుంది. సిల్వర్‌ నైట్రేట్‌తో సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌, హైదరాబాద్‌లోని ఓ ప్రయోగశాలలో దీన్ని తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద ఈ సిరా ఉత్పత్తికి 1962లోనే ఆయా సంస్థలు హక్కులు పొందాయి. 1976 నుంచి మరో 28 దేశాలకు దీన్ని పంపిణీ చేస్తుండటం గమనార్హం.    

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట


అందరూ సమానమే..!

ఎన్నికల హడావుడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికారులు పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తుంటారు. వీరిలో పోలీసులే కీలకం. ఓ వైపు ఎన్నికల్లో అమ్రాలు జరగకుండా చూసుకోవడమే కాకుండా, ప్రముఖుల సభలు, సమావేశాలకు భద్రత కల్పించడం వీరి బాధ్యతే. ఇక పోలింగ్‌ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలిందే. పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే వారు మాత్రం లోపలికి వెళ్లకూడదు. యూనిఫాంలో ఉన్నా లేకపోయినా ఈ నిబంధన వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నికల అధికారి ఆదేశిస్తే తప్ప అనుమతి ఉండదు.

  • అభ్యర్థి, ప్రముఖులు ఓటేసేందుకు వచ్చినా భద్రత సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి.
  • అభ్యర్థికి జడ్‌ ఫ్లస్‌ కేటగిరి రక్షణ ఉన్నా వారిని సైతం కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరినే అనుమతిస్తారు.
  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కేబినెట్‌ మంత్రులకు ఉండే భద్రతా సిబ్బంది సైతం లోపలికి వెళ్లకూడదు.
  • కేవలం ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం ఆజ్ఞా పత్రం ఉంటనే లోపలికి అనుమతిస్తారు.
  • ఎలాంటి మాటలు, సైగలు చేసినా నేరంగా పరిగణిస్తారు.

న్యూస్‌టుడే, చేగుంట


ప్రచారానికి, సభకు వస్తే మాకేంటి...

ప్రధాన పార్టీల ప్రచారం, జాతీయ స్థాయి నేతలు సభలకు జనసమీకరణకు ప్రస్తుతం అభ్యర్థులకు, నాయకులకు తలకు మించిన భారమే అవుతోంది. భారీ సభలకు అంతే మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అభ్యర్థి వెంట ప్రచారానికి తిరిగే వారికి సైతం సాయంత్రానికి ముట్టజెప్పాల్సిందే. గతంలో పార్టీలకు అంకితభావంతో పని చేసే నాయకులు ఉండేవారు. ఒకే పార్టీలో ఉంటూ నేతల వెంట తిరిగేవారు. అవసరమైతే సొంతంగా ఖర్చు పెట్టి నాయకులను గెలిపించుకునే వారు. సుదూర ప్రాంతాల్లో సభలు జరిగినా అభిమానంతో స్వచ్ఛందంగా తరలివచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రచారానికి, సభకు వెళ్తే నాకొచ్చేదేమిటి అంటున్న వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో పాటు ఖర్చులు పెరిగిపోయాయి. పురపాలికల్లో, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేయడానికి కనీసం నేత వెంట 50 మంది ఉండాల్సిందే. వారికి రోజుకు ఎంతోకొంత చెల్లించక తప్పడం లేదు.

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట, పాపన్నపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు