logo

‘భాజపాతోనే దేశాభివృద్ధి’

దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు.

Published : 09 May 2024 01:15 IST

భాజపాలో చేరిన ఆర్యవైశ్యులతో ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు, చీకోటి ప్రవీణ్‌ సమక్షంలో బుధవారం భాజపాలో చేరారు. వారు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, దేశ రక్షణ కోసం నిధులు కేటాయింపు, అంతర్గత భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. పరిశ్రమలు, రహదారుల ఆధునికీకరణ, విమానాశ్రయాల నిర్మాణం, వైద్యం, విద్యలో విప్లవాత్మకమైన మార్పులు సాధించిందని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను మోదీ ఇనుమడింపజేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు కల్పించి అందరికీ సమన్యాయం చేస్తున్న ఘనత భాజపాకే దక్కుతుందని తెలిపారు. అనంతరం రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో భారాస డబ్బులు పంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. పోలీసులతో కలిసి డబ్బులు పంచి గెలిచినందుకు సిగ్గుపడాలన్నారు. పోలీసుల విచారణలో రాధాకిషన్‌రావు... భారాస నేతలు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుపొందారని చెప్పారు కదా అన్నారు. కేసీఆర్‌ ఎంపీగా ఉండి పార్లమెంటుకు హాజరు కాలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సచివాలయానికి వెళ్లలేదన్నారు. వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌, హరీశ్‌రావులకు బినామీ అని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేశ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్‌, నాయకులు  పాల్గొన్నారు.

వర్గల్‌, న్యూస్‌టుడే: భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే భూములు లాక్కుంటారని భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. బుధవారం వర్గల్‌ మండల కేంద్రంలో జరిగిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. నెరవేరని హామీలిచ్చి రేవంత్‌రెడ్డి గద్దెనెక్కారని విమర్శించారు. నాయకులు బాల్‌రెడ్డి, నందన్‌గౌడ్‌, టేకులపల్లి రాంరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు