logo

పల్లె పులకరించేలా... ప్రకృతి మెచ్చేలా

గ్రామాల్లో జీవ వైవిధ్యం పెంపొందించేలా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. విశాలమైన ప్రభుత్వ స్థలాలు గుర్తించి అందులో రకరకాల మొక్కలు నాటి, వాటి మధ్యన రోడ్డు ఏర్పాటు చేసి పార్కుగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 21 Jan 2022 02:35 IST

మునుగోడు మండలం కోతులారంలో ప్రకృతి వనం

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామాల్లో జీవ వైవిధ్యం పెంపొందించేలా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. విశాలమైన ప్రభుత్వ స్థలాలు గుర్తించి అందులో రకరకాల మొక్కలు నాటి, వాటి మధ్యన రోడ్డు ఏర్పాటు చేసి పార్కుగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాను ఎంపిక చేసి అందులో ప్రకృతి వనాలు పెంచాలని సూచించింది. ఉమ్మడి జిల్లాలో గ్రామాల్లో 2,662 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.

పట్టణాలకే పరిమితమైన పార్కులు పల్లె ప్రకృతి వనాలతో పల్లెల్లోనూ కనువిందు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలకు కొత్త శోభ సంతరించుకుంది. గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ మొక్కల పెంపకం చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఉదయపు నడకకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు ప్రకృతి వనాల్లో పచ్చని చెట్లు, పూల మొక్కల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతత కోసం కాసేపు కూర్చుని వెళుతున్నారు. ప్రకృతి వనాలు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు, ప్రజలకు ఆహ్లాదం అందిస్తున్నాయి.

తిప్పర్తి మండలం ఆరెగూడెం గ్రామంలోని ప్రకృతి వనం

వనాలకు రూ.35.17 కోట్లు ఖర్చు

ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం రెండేళ్లలో ప్రభుత్వం రూ. 35.17 కోట్లు ఖర్చు చేసింది. నల్గొండ జిల్లాలో రూ. 18.17 కోట్లు, సూర్యాపేటలో రూ.8.01 కోట్లు, యాదాద్రిలో 6.10 కోట్లు వినియోగించారు. కొన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలను కనువిందు చేసేలా రూపొందించారు. మొక్కలను పెంచడమే కాకుండా నడకదారులు, పౌంటెన్లు, ద్వారాలు, ప్రహరీ గోడలపై శిల్పాలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో ప్రకృతి వనాల కోసం అధికారులు అసైన్డ్‌ భూములను ఎంపిక చేయడంతో అక్కడక్కడ సంబంధీకుల నుంచి నిరసనలు రావడంతో ఆయా గ్రామాల్లో వనాల ఏర్పాటులో కొంత జాప్యం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని