logo

జలవనరుల శాఖ భూముల్లో పల్లె ప్రకృతి వనాలు: కలెక్టర్‌

జిల్లాలోని జలవనరుల శాఖ భూముల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టాలని, సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

Published : 20 May 2022 02:51 IST

సూర్యాపేటలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, పక్కన అదనపు కలెక్టర్‌

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని జలవనరుల శాఖ భూముల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టాలని, సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. హరితహారంపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష జరిపారు. ఇరిగేషన్‌ కాల్వలకు రెండువైపులా భూముల్లో 50 మీటర్లు ఉంటే పల్లె ప్రకృతి వనాలు, 90 మీటర్లు ఉంటే మెగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్లతో కలిసి సంయుక్తంగా సర్వే చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో ఇప్పటికే కోటికి పైగా మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తామని తెలిపారు. ఉపాధి హామీ పనులు, కూలీ చెల్లింపు విధానంతో పాటు పంచాయతీల్లో నర్సరీలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, సూర్యాపేట, కోదాడ ఎస్‌ఈలు నాగేశ్వర్‌రావు, నర్సింగ్‌రావు, ఈఈలు భద్రునాయక్‌, విజయ్‌కుమార్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

మద్దిరాల గ్రామీణం: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. గోరెంట్లలో ఎస్సారెస్పీ 69 డీబీఎం కాల్వను పరిశీలించారు. ఎస్సారెస్పీ కాల్వను కబ్జా కోరల నుంచి కాపాడి అటవీ సంపదను పెంపొందించుకోవాలన్నారు. ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఈఈ సత్యనారాయణ, డీఈ హరికృష్ణ, తహసీల్దారు అమీన్‌సింగ్‌, ఎంపీడీవో సరోజ, ఏఈ శ్రీకాంత్‌, సర్వేయర్‌ రామ్మూర్తి, పంచాయతీ కార్యదర్శి మంగ పాల్గొన్నారు.

ఉప ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నేడు... సూర్యాపేట పట్టణం: జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. రెండు ఎంపీటీసీ, నాలుగు సర్పంచి, 227 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 9న ప్రచురించిన పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాపై, 24న ప్రచురించనున్న తుది పోలింగ్‌ స్టేషన్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని