logo

పెళ్లి కుదరడం లేదనే మనస్తాపంతో యువకుడి బలవన్మరణం

యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నకిరేకల్‌ మండలంలోని మంగళపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బచ్చుపల్లి శ్రావణ్‌కుమార్‌(30)

Published : 25 May 2022 02:49 IST

శ్రావణ్‌కుమార్‌

నకిరేకల్‌, న్యూస్‌టుడే: యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నకిరేకల్‌ మండలంలోని మంగళపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బచ్చుపల్లి శ్రావణ్‌కుమార్‌(30) బీఈడీ చదివి ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు రావడం లేదని, పెళ్లి కుదరడం లేదని కొంతకాలం నుంచి మనోవేదన చెందుతూ ఈ నెల 20న నకిరేకల్‌లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో రహదారి వెంట అపస్మారక స్థితిలో పడిపోయిన శ్రావణ్‌ కుమార్‌ను స్థానికులు గుర్తించి నకిరేకల్‌ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారని ఏఎస్సై వి.లింగయ్య తెలిపారు. ఇక్కడి నుంచి నల్గొండలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారని వివరించారు. మృతుడి తల్లి చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సీఐ ఎ.వెంకటయ్య నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై లింగయ్య పేర్కొన్నారు.

కుటుంబ కలహాలతో..

పెన్‌పహాడ్‌: యువకుడు ఉరేసుకొని బలవన్మరణం చెందిన ఘటన గంగ్లీతండాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దరావత్‌ హరికృష్ణ (28) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు.


అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన మిర్యాలగూడ మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామపంచాయతీ జంగాలకాలనీలో మంగళవారం వెలుగుచూసింది. గ్రామీణ ఎస్సై డి.నర్సింహులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగాలకాలనీకి చెందిన లక్ష్మమ్మ(30) నోటి నుంచి నురగలు రావడంతో పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

భర్త, అత్తింటి వారే చంపారు: అదనపు కట్నం కోసం భర్త జానయ్య, అత్త అనసూర్యమ్మ, తోటి కోడలు, బావ ఆహారంలో విషం పెట్టి హత్య చేశారని తల్లి నాగమ్మ, వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లక్ష్మమ్మకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారన్నారు.


ట్రాక్టర్‌ అదుపు తప్పి యువకుడు దుర్మరణం

షేక్‌ జానీ

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నార్కట్‌పల్లి శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలంలోని చౌటబావికి చెందిన షేక్‌ జానీ(22) గత కొంత కాలంగా తండ్రి హుస్సేన్‌తో కలిసి రాయి పని (రాతీ బండలను పగలకొట్టడం) చేస్తున్నారు. సోమవారం రాత్రి తమ ట్రాక్టర్‌లో జానీ ఒక్కడే రాతీ కడీల లోడు తీసుకొని ఎనుగులదోరి గ్రామానికి బయల్దేరారు. అన్‌లోడ్‌ చేసి నార్కట్‌పల్లి శివారులోని చెరువు కట్ట పైనుంచి తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్‌పై వస్తుండంగా ప్రమాదవశాత్తు వాహనం అదుపు తప్పడంతో ఇంజిన్‌, ట్రక్కు వేరయ్యాయి. ఈ ప్రమాదంలో జానీ కట్టపై నుంచి జారుకుంటూ కింద పడటంతో బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రామకృష్ణ గౌడ్‌ తెలిపారు.


ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొని మరొకరు..

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రెండో పట్టణ ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వల్లపు ఆంజనేయులు, గుంజ జానకిరాములు, దేవర్ల నాని ముగ్గురు మెదక్‌ జిల్లాలో సెంట్రింగ్‌ పనికోసం ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. పట్టణంలోని అద్ధంకి రహదారిపై వైజంక్షన్‌ సమీపంలోకి రాగానే వెనక నుంచి వేగంగా వస్తున్న ఆటో ఢీకొంది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వల్లపు ఆంజనేయులు(30) తీవ్రగాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతిచెందారు. గాయపడిన గుంజ జానకిరాములు, దేవర్ల నాని లను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స తరువాత హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


శ్రీనివాసనగర్‌ సమీపంలో బాలుడు..

మిర్యాలగూడ: అతివేగం ఆరేళ్ల బాలుడి ప్రాణాన్ని బలిగొంది. మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌ సమీపంలో మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి డీసీఎం ఢీకొన్న ఘటనలో చిన్నారి మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం అన్నారావుక్యాంపునకు చెందిన కలిమెల శ్రీనివాస్‌ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భార్య లింగమ్మ, కుమారుడు జ్యోతి స్వరూప్‌ (6)తో కలిసి మిర్యాలగూడలో నివాసముంటున్నారు. భార్య, కుమారుడితో కలిసి అన్నారావు క్యాంపునకు వెళ్లిన ఆయన మిర్యాలగూడకు ద్విచక్రవాహనంపై మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శ్రీనివాసనగర్‌ వద్ద వెనక నుంచి వేగంగా వస్తున్న డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనం ముందుభాగంలో కూర్చున్న జ్యోతి స్వరూప్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన లింగమ్మ, శ్రీనివాస్‌లను మిర్యాలగూడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని