logo

ఆర్టీసీ అద్దె డ్రైవర్లకు శిక్షణ తరగతులు

ఆర్టీసీ డిపోల్లో సంస్థ డ్రైవర్లతో పాటు అద్దె బస్సుల డ్రైవర్లు సైతం విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే సంస్థ ద్వారా నియమితులైన డ్రైవర్లు సుశిక్షితులై ఉంటారు.

Published : 04 Feb 2023 05:22 IST

మిర్యాలగూడలో అద్దె బస్సు డ్రైవర్ల శిక్షణలో మాట్లాడుతున్న ఎంవీఐ జిలానీ

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ డిపోల్లో సంస్థ డ్రైవర్లతో పాటు అద్దె బస్సుల డ్రైవర్లు సైతం విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే సంస్థ ద్వారా నియమితులైన డ్రైవర్లు సుశిక్షితులై ఉంటారు. వీరికి అప్పుడప్పుడు సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పునశ్చరణ, డీజిల్‌ ఆదా చేసిన వారికి, ఆదాయం రాబట్టిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తూ వారిని చైతన్య పరుస్తుంటారు. అయితే ఇటీవల సంస్థ బస్సులకు సమానంగా పలు డిపోల్లో అద్దె బస్సులు ఉన్నాయి. అయితే బస్సు యజమాని నియమించిన డ్రైవరే విధులు నిర్వహిస్తారు. వీరు ప్రయాణికులతో సఖ్యతగా ఉండడం, ఆదాయం రాబట్టడంలో అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదని గ్రహించిన యాజమాన్యం అద్దె బస్సుల డ్రైవర్లకు ఈ నెల 2 నుంచి 7 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.

పలు అంశాలపై..

అద్దె బస్సుల డ్రైవర్లు ప్రయాణికులతో సఖ్యతగా మెలగడంతో పాటు ప్రమాదరహిత డ్రైవింగ్‌ చేసేందుకు మోటారు వాహనాల తనిఖీ అధికారులు, ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరిస్తున్నారు. డ్రైవింగ్‌లో ఉన్న సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఏకాగ్రతతో ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా ప్రయాణికులను ఆకర్షించి ఆదాయం రాబట్టేందుకు సైతం వారిని చైతన్య పరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని