logo

ఏదీ.. ఆధునిక వధశాల..?

భువనగిరి పట్టణంలో ప్రయోగాత్మకంగా నిర్మించాలనుకున్న అధునాతన జంతు వధశాల ప్రతిపాదన అటకెక్కింది. నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం సమీపంలో 1.20 ఎకరాల భూమిని ప్రభుత్వం 18 నెలల క్రితం కేటాయించింది.

Published : 07 Feb 2023 06:22 IST

యాదగిరిగుట్టలో అటకెక్కిన ప్రతిపాదన
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే

మార్కెట్‌లో మాంసం విక్రయాలు

భువనగిరి పట్టణంలో ప్రయోగాత్మకంగా నిర్మించాలనుకున్న అధునాతన జంతు వధశాల ప్రతిపాదన అటకెక్కింది. నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం సమీపంలో 1.20 ఎకరాల భూమిని ప్రభుత్వం 18 నెలల క్రితం కేటాయించింది. రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. నిర్మాణానికి అయ్యే నిధులను పురపాలక సంఘం, పశుసంవర్ధకశాఖ, జిల్లా పాలనాధికారి నిధులను సమకూర్చాలని అప్పట్లో నిర్ణయించారు. పనులు ప్రారంభమయ్యే లోపు ప్రతిపాదన అటకెక్కడం గమనార్హం.

సదుపాయాలు ఇవే..

అధునాతన వధశాల నిర్మాణంతో సదుపాయాలు సమకూరనున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జీవ కారుణ్య నియమానుసారంగా గొర్రెలు, మేకలు వధిస్తారు. ఒక వధశాల నిర్మాణంతో పొరుగు జిల్లాలతో పాటు, శివారు పట్టణాలకు నాణ్యమైన మాంసం అందించే వీలుంది. స్లాటర్‌ హౌజ్‌, రేయిలింగ్‌ హ్యాంగ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణాలు ఉంటాయి. పూర్తిస్థాయిలో పరిశుభ్రతను పాటించేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఇందులో పనిచేసే వారు చేతికి తొడుగులు, మాస్క్‌లు, ప్రత్యేక దుస్తులు ధరించి తమ విధులు నిర్వహిస్తారు.

అధికారుల అధ్యయనం ఇలా...

భువనగిరి పట్టణంలో కొనసాగుతున్న మాంసం విక్రయాలపై గతంలో జాతీయ మాంసం నాణ్యత ప్రమాణాల సంస్థ అధికారులు పర్యటించి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తమ నివేదికల్లో పేర్కొన్నారు. మాంసం మార్కెట్లపై పర్యవేక్షణ, నియంత్ర లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తమ అధ్యయనంలో తేల్చారు. మాంసాన్ని నిల్వచేసి రెండు రోజుల వరకు విక్రయిస్తుండటంతో కుళ్లిపోయి అనారోగ్యానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశువైద్యుడి అనుమతి లేకుండానే జంతువులను వధిస్తున్నట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితి..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిబంధలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు కలుషిత మాంసం భుజిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అత్యధిక మున్సిపాలిటీల్లో నైజాం హయాంలో నిర్మించిన వధశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ సాకు చూపి వ్యాపారులు ఇళ్ల వద్దే మేకలు, గొర్రెలను, ఇతర జీవాలను వధించి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీల్లో మటన్‌, చికెన్‌, బీఫ్‌, ఫిష్‌ మార్కెట్లు ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.

* ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డిని వివరణ కోరగా ఆధునిక వధశాల ప్రతిపాదన ప్రస్తుతం లేదన్నారు. మాంసం విక్రయాలపై పర్యవేక్షణ పెంచి చర్యలు చేపడతామని వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని