logo

యంత్రాలు ఉన్నా..ఫాగింగ్‌ సున్నా

ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో దోమల బెడద అధికమవుతోంది. ఎక్కడా నివారణ చర్యలు కనిపించడం లేదు. రోజురోజుకూ జనాభాతో పాటు పట్టణాల విస్తీర్ణం పెరుగుతోంది.

Updated : 07 Jun 2023 04:08 IST

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే

సూర్యాపేట పట్టణం

ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో దోమల బెడద అధికమవుతోంది. ఎక్కడా నివారణ చర్యలు కనిపించడం లేదు. రోజురోజుకూ జనాభాతో పాటు పట్టణాల విస్తీర్ణం పెరుగుతోంది. దానికి తగ్గట్లు పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోతున్నా.. పూర్తిస్థాయిలో పరిశుభ్రత పనులు జరగడం లేదు. పురపాలికల్లో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినా ప్రయోజనం శూన్యమే. ఎక్కడా యంత్రాలు పట్టుకొని పిచికారి చేసిన దాఖలాలు లేవు. రూ.లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన యంత్రాలు మూలుగుతున్నాయి.

పాతవి పక్కకు.. కొత్తవి కొనుగోలు..

పురపాలికల్లో పాత ఫాగింగ్‌ యంత్రాలు మరమ్మతులకు గురవడంతో వాటిని మూలన పడేసి కొత్తవి కొనుగోలు చేశారు. వీటిలో కూడా వార్డుల్లో దోమల నివారణకు మందును సరిగా పిచికారి చేయడం లేదు. దీంతో దోమలు విజృంభించి పురపాలిక వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు దోమల మోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రమైతే ఏ వీధిలో చూసినా దోమల మోతే మోగుతోంది. కొన్ని పురపాలికల్లో యంత్రాలు పని చేయకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఏటా రూ.లక్షల్లో ఖర్చు

ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో దోమల నివారణకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కానీ నివారణకు అడుగు ముందుకు పడటం లేదు. 19 పురపాలికల్లో ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చుచేస్తున్నారు. దోమల నివారణలో మలాథియన్‌ ద్రావణం కీలకం. దాని పేరు చెప్పి కిరోసిన్‌ పోసి పైపైన ఫాగింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యంత్రాల ట్యాంకు సామర్థ్యానికి తగ్గట్లు పెట్రోలు, డీజిల్‌లో మలాథియన్‌ మిశ్రమం కలిపి ఫాగింగ్‌ చేయాలి. ఇవేమీ పాటించకుండా మొక్కుబడిగా చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని