logo

Telangana Elections: ఐదేళ్లు ఆడే సినిమా.. నేనే ఎమ్మెల్యే!

‘నేనే ఎమ్మెల్యే’ పేరుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం ఓ రాజకీయ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వంద రోజులు (ఐదేళ్లు) నడిచే ఈ సినిమా (పాలన) తమను సంతోషంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ ప్రేక్షకులు (ఓటర్లు) ఎదురుచూసిన వేళ ఇది....

Updated : 03 Dec 2023 08:58 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడే విడుదల

‘నేనే ఎమ్మెల్యే’ పేరుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం ఓ రాజకీయ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వంద రోజులు (ఐదేళ్లు) నడిచే ఈ సినిమా (పాలన) తమను సంతోషంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ ప్రేక్షకులు (ఓటర్లు) ఎదురుచూసిన వేళ ఇది....

12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని.. దాదాపు 25 లక్షల మంది ప్రేక్షకులు (ఓటర్లు) తాము మెచ్చిన కథానాయకుడు (నియోజకవర్గ ఎమ్మెల్యే) ఎవరో ఈ రోజే తేల్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ (పోలింగ్‌)ను సెన్సార్‌ బోర్డు (ఎన్నికల సంఘం) ఇప్పటికే పూర్తి చేసి సినిమా విడుదల (ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి)కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన విషయం తెలిసిందే. వాస్తవంగా కథ (ఎన్నికల) కోసం ఆర్నెళ్ల నుంచే చిత్ర బృందాలు (రాజకీయ పార్టీలు) కుస్తీ పట్టాయి. ‘నేనే ఎమ్మెల్యే’ అనే ఒకే పేరు గల సినిమా (పాలన) కోసం కథా రచయితలు, దర్శక నిర్మాతలు (రాజకీయ పార్టీల అధినేతలు) పోటీపడ్డారు. కొన్నాళ్లు తలమునకలై ఎట్టకేలకు కథానాయకుడి (ఎమ్మెల్యే అభ్యర్థి) ని ఎంపిక చేశారు. ఒకే కథా (ఎన్నికలు) లక్ష్యంతో సినిమా (పాలన) కోసం పోటీపడిన హీరో (ఎమ్మెల్యే అభ్యర్థులు)లు 276 మంది. వీరిలో దర్శకనిర్మాతల (రాజకీయ పార్టీల అధినేతలు) ద్వారా కథ (ఎన్నిక) లోకి వచ్చిన వారు, సొంతంగా (స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు) కొందరున్నారు. ఒక్కొక్క చిత్ర బృందం (అధినాయకులు) గత నెలలోనే హీరో (అభ్యర్థి)తో అన్ని లోకేషన్‌ (నియోజకవర్గం) లలో కష్టపడి షూటింగ్‌ (ప్రచారం) చేశారు. చిత్రంలో నటీనటులు (పార్టీల ద్వితీయ శ్రేణి, కార్యకర్తలు) పాత్ర (పనితీరు) ను పండించారు. మొదటి నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ షూటింగ్‌ (ప్రచార) వివరాలనూ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమాలు కవర్‌ చేశాయి. ఆ మధ్యనే ప్రీ ట్రైలర్‌ (బహిరంగ సభ) లలో ప్రేక్షకులు (ఓటర్లు) ఆదరిస్తే రాబోయే సినిమా (పాలన) గురించి చెప్పేశారు. పాటల సీడీ (మేనిఫెస్టో బ్రోచర్లు) లు విడుదల చేశారు. సంగీత దర్శకులు (మేనిఫెస్టో రూపకర్తలు), గాయకులు (జానపద కళాకారులు) పాటలు ప్రేక్షకుల (ఓటర్ల)కు ఇంపు (ఆకర్షణ) గా రూపొందించి విన్పించారు. ఫైట్‌ మాస్టార్ల (సలహాదారులు) సూచనలతో ఫైట్లూ (రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు) బాగా వేశారు. సినిమా విడుదల (పోలింగ్‌ ఫలితాల) కు ముందే ప్రీ రిలీజ్‌ షో (సర్వే ఫలితాలు) తో ఎవరికి వారే సంతోషించారు. తమ వాడే హీరో (ఎమ్మెల్యే) అని భుజాలు ఎగరేశారు. ఎవరి సినిమా (పాలన), ఎవరి హీరో (ఎమ్మెల్యే అభ్యర్థి)కి ఎంతటి ప్రేక్షక (ఓటర్ల) ఆదరణ లభిస్తుందో ఆదివారం చూడాలి. అందులో కథా నాయకుడి (ఎమ్మెల్యే అభ్యర్థి) పాత్ర ఎంత ఉందో అర్థమవుతుంది. కథలో సంగీతం, పాటలు (పార్టీల మేనిఫెస్టోలు) ప్రేక్షకుల (ఓటర్లు) మదిని ఏ స్థాయిలో దోచుకున్నాయో.. తేలిపోనుంది. వంద రోజులు మంచి సినిమా (పాలన) చూసేందుకు ప్రేక్షకులు (ఓటర్లు) థియేటర్ల (నియోజకవర్గాలు) లో ఇప్పటికే టిక్కెట్లు (ఓట్లు) బుక్‌ (వేశారు) చేసుకున్నారు. ప్రేక్షకుల (ఓటర్ల) ఆదరణ పొందిన సినిమా (పాలన పార్టీ), హీరో (ఎమ్మెల్యే) మునుముందు శత దినోత్సవ (ఐదేళ్ల పాలన) వేడుకలు ప్రేక్షకుల (ఓటర్ల) మదని మెప్పించేలా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం!!

న్యూస్‌టుడే, మేళ్లచెరువు, మిర్యాలగూడ పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని