logo

వ్యాను ఢీకొని రైతు మృతి

ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది.

Updated : 19 Apr 2024 06:31 IST

మఠంపల్లి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇదే గ్రామానికి చెందిన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు(60) సాయంత్రం తన పొలం వద్దకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తోన్న చేపల వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును హుజూర్‌నగర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. చోదకుడు వ్యానును వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. తమకు ఫిర్యాదు అందలేదని, ఘటనా స్థలంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.


సైబర్‌ నేరగాళ్ల మోసం.. మహిళా నగదు మాయం

 రామన్నపేట, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్ల మోసానికి గురై ఓ మహిళ నగదును కోల్పోయిన ఘటన మండలంలోని సిరిపురంలో చోటు చేసుకుంది. ఎస్సై పి.మల్లయ్య గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన ఓ మహిళకి గత ఏడాది సెప్టెంబరు 23న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీరు కొంత నగదు డిపాజిట్‌ చేస్తే రెట్టింపు నగదు ఇస్తామని తాము చెప్పిన నంబరుకు నగదు పంపించాలని చెప్పాడు. మాటలను నమ్మిన మహిళ ముందుగా గుర్తు తెలియని వ్యక్తి పంపిన నంబరుకు రూ.3వేలు ఫోన్‌పే చేసింది. మరికొంత నగదు పంపించాలని ఆ వ్యక్తి కోరగా పలు విడతల్లో అదే రోజు రూ.1.07లక్షల వరకు ఫోన్‌పే చేసింది. సమయం గడిచినప్పటికీ తన ఖాతాలో ఎలాంటి నగదు జమ కాలేదు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన మహిళా సెప్టెంబరు 24న సైబర్‌ క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. నిబంధనల మేరకు ఈ కేసు వివరాలను సైబర్‌ క్రైం పోలీసులు రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌కు పంపించటంతో, ఆమె స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు  

నల్గొండ లీగల్‌, డిండి, న్యూస్‌టుడే: మైనర్‌ను అపహరించి, అత్యాచారం చేసిన నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం మర్రిపల్లి తండాకు చెందిన అంగోత్‌ వినోద్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష, జరిమానాగా రూ.53 వేలు చెల్లించాలని జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ న్యాయస్థాన న్యాయమూర్తి బి.తిరుపతి గురువారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా డిండి మండలంలోని ఓ తండాకు చెందిన మైనర్‌కు దూరపు బంధువు అయిన నిందితుడు ప్రేమిస్తున్నానని వేధించి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం కారులో తండాకు వచ్చిన నిందితుడు ఆ బాలికను అక్కడి నుంచి బలవంతంగా అపహరించి, హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లో గదిని అద్దెకు తీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్నంత కాలం ఆమెను శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. ఆ వేధింపులు భరించలేక అక్కడి నుంచి తప్పించుకొన్న బాలిక 2023 ఫిబ్రవరి 20న తన ఇంటికి చేరుకొని తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన అప్పటి డిండి సీఐ పి. పరశురామ్‌, నిందితుడు అంగోత్‌ వినోద్‌ను అరెస్టు చేసి అతనిపై ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. అనంతరం న్యాయస్థాన విచారణలో నిందితుడిపై నేర నిర్ధారణ కావడంతో మూడేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా, అక్రమ నిర్బంధానికి పాల్పడినందుకు ఏడాది జైలు, రూ.వెయ్యి జరిమానా, బెదిరింపులకు పాల్పడినందుకు ఏడాది జైలు, రూ.వెయ్యి జరిమానా, మైనర్‌   అని తెలిసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినందుకు 20 ఏళ్ల జైలు, రూ.20 వేల జరిమానా, ఆమె తన బంధువు అని తెలిసి కూడా అత్యాచారానికి పాల్పడినందుకు మరో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ. 20 వేల జరిమానా, మైనర్‌ను బలవంతంగా అనుభవించినందుకు పోక్సో చట్టం ప్రకారం మరో పదేళ్లు జైలు, రూ.10 వేల జరిమానాను న్యాయమూర్తి బి.తిరుపతి విధించారు.
పైశిక్షలన్నీ ఏకకాలంలో అమలు జరపాలని, జరిమానా రూ.53 వేలు చెల్లించాలని న్యాయమూర్తి తెలిపారు. జరిమానాలో నుంచి ప్రభుత్వానికి రూ.మూడు వేలు చెల్లించాలని,  మిగతా రూ. 50 వేలను బాధితురాలికి చెల్లించాలని న్యాయమూర్తి తన తీర్పులో ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పీపీలు సిరిగిరి వెంకట్‌రెడ్డి, జయరామ్‌నాయక్‌లు వాదించగా జిల్లా కోర్టు లైజన్‌ అధికారులు నరేందర్‌, సుమన్‌లు, డిండి పోలీసులు సహకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని