logo

ముందస్తుకు మస్తు స్పందన

పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్‌గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు.

Updated : 30 Apr 2024 06:22 IST

నేటితో ఎర్లీబర్డ్‌ పథకానికి ముగియనున్న గడువు

నల్గొండలో ముందస్తు పన్ను చెల్లిస్తున్న ప్రజలు

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్‌గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. నల్గొండ జిల్లా పరిధిలోని 8 పురపాలికల్లో నందికొండ మినహా మిగతా వాటిల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఆయా కార్యాలయాల వద్ద బారులు తీరారు.

నేటితో గడువు పూర్తి..

పురపాలికలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఆస్తి పన్ను ముఖ్యమైనది. ఆ పన్ను బకాయిలు లేకుండా వసూలు చేయడం పుర యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.ఏడాది చివరలో హడావుడి చేసి వసూలు చేయడం తప్ప ఇతర సమయాల్లో వసూళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో పట్టణాల్లో పన్నుల బకాయిలు రూ.కోట్లల్లో పేరుకుపోతున్నాయి. గత ఏడాది వందశాతం వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించినా ఒక్కో మున్సిపాలిటీ 50 శాతం నుంచి 80శాతంలోపే రాబట్టాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ముందస్తుగా పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కల్పించేలా ఎర్లీబర్డ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై అధికారులు పెద్దగా ప్రచారం నిర్వహించారు. ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు ఈనెల 30తేదీ లోపు ముందస్తుగా 2024-25 కు సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించే వారికి మాత్రమే 5శాతం రాయితీ కల్పించడంతో ప్రజలు బారులు తీరుతున్నారు. ఇక మంగళవారం ఒక్క రోజే అవకాశం ఉండటంతో చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా పుర కార్యాలయాల వద్ద కౌంటర్ల సంఖ్య పెంచారు. ముందస్తు ప్రణాళిక ద్వారా సమకూరే ఆదాయంతో పట్టణాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశముంది.


సద్వినియోగం చేసుకోవాలి:

ముసాబ్‌ అహ్మద్‌ సయ్యద్‌, కమిషనర్‌, నల్గొండ పురపాలిక

ఎర్లీ బర్డ్‌ పథకం సద్వినియోగం చేసుకోవాలి. మంగళవారం ఒక రోజే అవకాశం ఉంది. ముందస్తుగా చెల్లిస్తే ఆస్తి పన్నులో ఐదు శాతం రాయితీ లబ్ధిపొందే అవకాశం ఉంది. లక్ష జనాభా దాటిన పట్టణాల్లో నల్గొండ పురపాలిక మెరుగైన వసూలు రాబట్టింది. ఈ నెల 30 గడువు ముగియనుండటంతో పుర కార్యాలయం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశాం. పట్టణ ప్రజలు స్పందించి మీ ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించి పురపాలిక అభివృద్ధికి సహకరించాలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని