మండుటెండలు మరింతగా..

ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి.

Updated : 02 May 2024 10:55 IST

నల్గొండ జిల్లాలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత
10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46 డిగ్రీలపైనే..
వడదెబ్బతో ఏడుగురు మృత్యువాత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. పది జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 46.6 డిగ్రీలు నమోదైంది. ఈ జిల్లాలోని పలు మండలాలు 46.5 నుంచి 46.2 డిగ్రీల ఎండతో అల్లాడాయి. ఇది ఆందోళనకర పరిణామమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికంగా..

రాష్ట్రంలో సాధారణం కన్నా సగటున 2.1 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. గత ఏడాది మే 1తో పోల్చితే ఏకంగా 7.5 డిగ్రీలకుపైగా పెరుగుదల కనిపిస్తోంది. ఉదాహరణకు జగిత్యాలలో గతేడాది ఇదే రోజున 35.6 డిగ్రీలు నమోదు కాగా బుధవారం 45.6 డిగ్రీలు కనిపించింది. నల్గొండ జిల్లాలో 8 మండలాలు, జగిత్యాలలో 6, కరీంనగర్‌లో 4, సిద్దిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్‌లో 2, జగిత్యాల జిల్లాలో 2 మండలాలతోపాటు ఖమ్మం నగరంలో వడగాలులు వీచినట్లు వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల 5వ తేదీ వరకు వడగాలుల ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

వడదెబ్బతో గాలిలో కలిసిన ప్రాణాలు

రామడుగు, జనగామ టౌన్‌, బోథ్‌, మంచిర్యాల వైద్యవిభాగం, తిమ్మాపూర్‌, కమలాపూర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట బూడిగజంగాల కాలనీకి చెందిన దివ్యాంగ బాలుడు కల్లెం యశ్వంత్‌(5) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో రేకుల వేడికి తాళలేక మృతిచెందాడు. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన మహ్మద్‌ మొహినొద్దీన్‌(52) కూలీ పనులు చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోనే కుప్పకూలి మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లా సొనాల మండలం పార్డి-బి గ్రామ పంచాయతీ పరిధిలోని పర్పులపల్లెకు చెందిన ఆత్రం జంగు(48) పొలం పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగానే ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఏపీలోని కాకినాడ జిల్లా తునికి చెందిన బదావతి హటియా(68) వడదెబ్బకు చికిత్స పొందుతూ మృతిచెందారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో ఆటోడ్రైవర్‌ రొడ్డ నర్సయ్య(46) ఎండదెబ్బకు గురై చికిత్స పొందుతూ బుధవారం పరిస్థితి విషమించి మృతిచెందారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గూడూరు గ్రామానికి చెందిన పత్తిపాక రమేశ్‌(55) దుస్తులు విక్రయిస్తుంటారు. ఈయన వడదెబ్బకు గురికావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా.. అప్పటికే మృతిచెందారు.


ఎన్నికల శిక్షణకు వెళ్లిన ఉపాధ్యాయురాలు మృతి

వడదెబ్బతో ఉపాధ్యాయురాలు మృతిచెందిన సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో జరిగింది. దోమ మండలానికి చెందిన రాణి(35) బషీరాబాద్‌ మండలం టాకీతండా ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఎంపీ ఎన్నికలపై బుధవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన శిక్షణకు హాజరయ్యారు. సాయంత్రం తిరిగి బషీరాబాద్‌ వెళ్లేందుకు బస్టాండుకు వచ్చారు. తలనొప్పిగా ఉందంటూ వాంతి చేసుకొని సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

న్యూస్‌టుడే, బషీరాబాద్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని