logo

అంతర్జాలంలో శోధించి...తుపాకీతో తిరిగొచ్ఛి.

తుపాకీ కోసం రెండు నెలలపాటు అంతర్జాలంలో శోధించాడు. లైసెన్స్‌ లేకుండా దాన్ని తీసుకుని.. ప్రేమించిన యువతిని కడతేర్చాలని కక్షతో అన్వేషించాడు. ఎట్టకేలకు బిహార్‌లో దొరుకుతుందని గుర్తించాడు. 20 రోజులు అక్కడే ఉండి.. తుపాకీని సిద్ధం చేసుకున్నాడు. అదను చూసి యువతిని చంపి..

Updated : 20 May 2022 11:18 IST

తాటిపర్తి కాల్పుల ఘటనలో ఒకరి అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న చౌడేశ్వరి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: తుపాకీ కోసం రెండు నెలలపాటు అంతర్జాలంలో శోధించాడు. లైసెన్స్‌ లేకుండా దాన్ని తీసుకుని.. ప్రేమించిన యువతిని కడతేర్చాలని కక్షతో అన్వేషించాడు. ఎట్టకేలకు బిహార్‌లో దొరుకుతుందని గుర్తించాడు. 20 రోజులు అక్కడే ఉండి.. తుపాకీని సిద్ధం చేసుకున్నాడు. అదను చూసి యువతిని చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు సురేష్‌రెడ్ఢి పొదలకూరు మండలం తాటిపర్తిలో జరిగిన తుపాకీ కాల్పుల కేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగేశారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు నిర్వహించి.. తుపాకీ ఎలా తీసుకున్నాడనే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయా వివరాలను గురువారం జిల్లా అదనపు ఎస్పీ చౌడేశ్వరి స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాటిపర్తికి చెందిన సురేష్‌రెడ్ఢి. కావ్యశ్రీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి పెద్దలు అంగీకరించలేదు. మనస్తాపం చెందిన అతడు.. ఈ నెల 9న కావ్యశ్రీ ఇంటికి వెళ్లి తుపాకీతో ఆమెను చంపి.. తానూ షూట్‌ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత జిల్లాలో కాల్పుల సంఘటన కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా ఉత్తర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నట్లు గుర్తించారు. సంఘటన జరిగిన రోజే.. ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశాలతో నాలుగు బృందాలు ఉత్తర భారతానికి వెళ్లాయి. ఎట్టకేలకు పట్నాలో అనధికారికంగా తుపాకీ తీసుకున్నట్లు గుర్తించారు.

పరారీలో మరొకరు

తుపాకీ కాల్పుల సంఘటనతో ఉలిక్కిపడిన జిల్లా పోలీసుశాఖ కేసును సీరియస్‌గా తీసుకుంది. సంఘటన జరిగిన వెంటనే నాలుగు బృందాలతో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించింది. ఆ క్రమంలోనే తుపాకీని అనధికారికంగా విక్రయించిన ఇద్దరిలో ఒకరైన రమేష్‌కుమార్‌ను ఒక బృందం అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిందితుడైన ఉమేష్‌కుమార్‌ పరారీలో ఉండగా.. అతడి కోసం మరో బృందం పని చేస్తోందని అదనపు ఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. త్వరలో అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. సమావేశంలో సీసీఎస్‌ పోలీసులు పాల్గొన్నారు.

20 రోజులు అక్కడే మకాం..

రెండు నెలలపాటు తుపాకీ కోసం అంతర్జాలంలో అన్వేషించిన సురేష్‌రెడ్ఢి. బిహార్‌ రాష్ట్రం పట్నా పున్‌పున్‌ పోస్టు, కందాప్‌లో లభ్యవుతుందని తెలుసుకున్నాడు. 2021 అక్టోబరు, నవంబరు నెలలో అదే పనిలో ఉన్నాడు. డిసెంబర్‌లో అక్కడికి వెళ్లి.. కందాస్‌ గ్రామంలోని కారు డ్రైవర్‌ రమేష్‌కుమార్‌ను కలిశాడు. ఆపై అతడి సోదరుడు ఉమేష్‌కుమార్‌ను పరిచయం చేసుకున్నాడు. 20 రోజుల పాటు అక్కడే ఉండి.. స్థానికంగా తయారు చేసిన తుపాకీని వారిద్దరి నుంచి కొనుగోలు చేశాడు. జనవరిలో తుపాకీతో పాటు నెల్లూరుకు తిరిగొచ్చిన సురేష్‌రెడ్ఢి. సమయంలో కోసం ఎదురు చూశాడు. దాదాపు అయిదు నెలల తర్వాత కావ్యశ్రీని హత్య చేసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని