logo

పొలం విక్రయం పేరుతో రూ.20 లక్షలకు టోకరా

పొలం విక్రయిస్తానని నమ్మించి రూ.20 లక్షల నగదు కాజేసిన ఘటనకు సంబంధించి వేదాయపాలెం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

Published : 02 Feb 2023 02:24 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: పొలం విక్రయిస్తానని నమ్మించి రూ.20 లక్షల నగదు కాజేసిన ఘటనకు సంబంధించి వేదాయపాలెం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన కె.ద్వారకారమేష్‌ అనే న్యాయవాది అక్కడ సాయి ప్రాపర్టీస్‌ కంపెనీ, దాని అనుబంధ సంస్థ అయిన ఫార్మా ల్యాండ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి సలహాదారుడుగా.. కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. కలిగిరికి చెందిన బాబు, నారాయణ అనే మధ్యవర్తులు దుత్తలూరు ప్రాంతంలో 80 ఎకరాల పొలం ఇప్పిస్తామని, యజమాని చినవెంగళ్‌రెడ్డి నగరంలోని సర్దార్‌ వల్లభాయిపటేల్‌నగర్‌లో ఉన్నారని వారింటికి తీసుకెళ్లారు. దుత్తలూరులో 80 ఎకరాల భూమిని విక్రయించేందుకు సిద్ధమని నమ్మించి గతేడాది సెప్టెంబరు 20వ తేదీన రూ.20 లక్షలు అడ్వాన్సుగా బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నారు. అక్టోబరు 5వ తేదీలోపు పొలాన్ని రిజిస్టర్‌ చేయిస్తానని నమ్మించారు. రిజిస్ట్రేషన్‌ చేయించకుండా చినవెంగళ్‌రెడ్డి తప్పించుకు తిరుగుతూ కాలయాపన చేస్తుండడంతో సదరు కంపెనీ నిర్వాహకులు అనుమానం వచ్చి ఆరా తీశారు. దుత్తలూరులో ఉన్న ఆ పొలం వేరొకరిదని   తెలుసుకున్నారు. నగరంలోని సర్దార్‌ వల్లబాయి పటేల్‌ నగర్‌లో ఉన్న ఇల్లు కూడా అద్దెదని తెలిసింది. ఈ విషయమై కంపెనీ నిర్వాహకులు చిన వెంగళ్‌రెడ్డిని నిలదీయగా  అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా అగ్రిమెంట్‌ పేపర్‌ తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో చంపేస్తామని బెదిరించారు. దీంతో మోసపోయామని గ్రహించిన కంపెనీ న్యాయవాది ద్వారకారమేష్‌ బుధవారం వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని