logo

తెరచుకోని పాఠం

మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్‌ హైస్కూల్‌)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించారు

Published : 28 Mar 2024 04:38 IST

ఇచ్చిన ట్యాబ్‌లలో మిసింగ్‌ ఎస్‌డీ కార్డ్‌ అనే మెసేజ్‌
నెల్లూరు మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్‌ హైస్కూల్‌)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించారు. సాంకేతిక సమస్యలతో రోజూ పదుల సంఖ్యలో తెరుచుకోవడం లేదు. పనిచేయక.. ఎవరికి చూపించాలో తెలియక.. 20 ట్యాబ్‌లు పక్కన పెట్టేశారు.

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, వారికి చదువు చెప్పే గురువులకు రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి ట్యాబ్‌లు అందజేసింది. విద్యార్థులు యాప్‌లో పాఠాలు విని.. అందులోనే సమాధానాలు నమోదు చేయించాల్సి ఉండగా- ఉపాధ్యాయులు వారితో ఆ పని చేయించడంతో పాటు వారూ విని వారి వంతు చేయాల్సి ఉంది. ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంత వరకు సరేలే అనుకున్నా.. ట్యాబ్‌లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరీక్షగా మారాయి. జిల్లాలో చాలా వరకు ట్యాబ్‌లు పనిచేయడం లేదు. ఆన్‌ చేయగానే ‘మిసింగ్‌ ఎస్‌డీ కార్డు ప్లీజ్‌. ఇన్‌సెర్ట్‌ బైజూస్‌ ఎస్‌డీ కార్డ్‌  ఇన్‌ టుది ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ ఎర్రర్‌ 2002’ అనే సందేశం వస్తోంది. ఎస్‌డీ కార్డు తీసి.. తిరిగి స్లాట్‌లో పెట్టి.. ఆన్‌ చేసినా అదే పరిస్థితి ఎదురవుతోంది. లాగిన్‌ కాకపోవడం, నెట్‌ వర్క్‌ అందకపోవడం, లాక్‌ పడిపోవడం, దానికదే ఆఫ్‌ కావడం వంటి ఇబ్బందులతో విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దకు పరుగులు తీస్తుండగా- వారికీ పూర్తిస్థాయి అవగాహన లేక చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో పదుల సంఖ్యలో ఈ తరహా సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

 తల పట్టుకుంటున్న సిబ్బంది

ట్యాబ్‌లు అందించడం వరకే అన్నట్లు.. విద్యాశాఖ అంతటితో చేతులు దులుపుకొంది. సాంకేతికతపై పట్టులేక.. తలెత్తుతన్న సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఏమీ పాలుపోని పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న వారికి చూపించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పాఠశాలల్లో పదుల సంఖ్యలో పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా బుధవారం రామయ్యబడిలో ట్యాబ్‌ సమస్యల పరిష్కారానికి వచ్చిన విద్యాశాఖ నియమించిన సాంకేతిక సిబ్బంది సైతం ఏమీపాలుపోక తలపట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 12వేలకుపైగా మరమ్మతులకు గురైనట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు సాంకేతిక సిబ్బంది బైజూస్‌ వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు లేదు.. దాంతో ఆ సంస్థ వాటిని గాలికి వదిలేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.


సమస్య పరిష్కరిస్తాం

ట్యాబ్‌లలో సాంకేతిక సమస్యలు వస్తే.. వాటి గుర్తింపు సంఖ్య ద్వారా ఆన్‌లైన్‌(వెబెక్స్‌)లో రాష్ట్ర నిపుణులకు పంపి పరిష్కరిస్తున్నాం. మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం. జిల్లా వ్యాప్తంగానూ కొంత మందిని ఏర్పాటు చేశాం. వారికి చూపిస్తే పరిష్కరిస్తారు.

- పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని