logo

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం.. తొలిరోజే గందరగోళం!

జగన్‌ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులను పోస్టల్‌ బ్యాలెట్‌కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 06 May 2024 05:58 IST

కేంద్రాలు తెలియక.. ఉద్యోగ, ఉపాధ్యాయుల అవస్థలు

నెల్లూరు : ఓటు వేసేందుకు బారులుదీరి..

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులను పోస్టల్‌ బ్యాలెట్‌కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం చోటు చేసుకున్న కొన్ని ఉదంతాలు వాటికి ఊతంగా నిలిచాయి. ఆత్మకూరు పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని జాబితాల్లో కొందరు ఉద్యోగుల పేర్లు లేవన్న ప్రచారంతో గందరగోళం నెలకొనగా.. ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి అక్కడికి చేరుకుని.. సమస్యను కలెక్టర్‌ హరినారాయణ్‌తో పాటు ఆర్వో మధులత దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆర్వో మాట్లాడుతూ.. ఎన్నికల బాధ్యతల ఉత్తర్వు చూపి.. జాబితాలో పేరు లేని వారు ఓటు వినియోగించుకోవాలని సూచించారు. ఇక నెల్లూరులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు కేంద్రాలు తెలియక ఎండలో ఇబ్బందులు పడ్డారు. ఓటు వేసేందుకు దూర ప్రాంతం నుంచి వస్తే.. ఇక్కడ కాదు.. మరోచోటకు వెళ్లాలని చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా తొలిరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు అధికారులు, ఉద్యోగులు ఉత్సాహం చూపారు. నెల్లూరుతో పాటు 9 ఫెసిలిటేషన్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఎండ ఉన్నప్పటికీ ఓపిగ్గా వరుసలో నిల్చొని.. ఓట్లు వేశారు.

 8వ తేదీ వరకు గడువు పెంపు..

ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు గడువు పెంచారు. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో విధులు కేటాయించిన ఉద్యోగులకు 9 ఫెసిలిటేషన్‌ కేంద్రాల ద్వారా ఆదివారం నుంచి 7వ తేదీ వరకు అవకాశం ఉండగా.. మరో రోజు పొడిగించారు. ఈ నెల ఒకటో తేదీ నాటికి ఫారం-12 ఇవ్వలేకపోయిన వారికి.. ఈ నెల 7, 8 తేదీల్లో వారి ఓటు ఏ నియోజకవర్గంలో నమోదై ఉంటుందో.. అక్కడి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో విధుల్లో ఉన్న ఇతర జిల్లాలకు చెందిన వారు.. ఆ జిల్లాల్లో ఫారం-12 అందజేసి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో ఓటు కలిగి.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు.. ఈ నెల ఆరో తేదీ ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు.

ఓట్లు చూసుకుంటున్న ఉద్యోగులు


అక్కడ లేదని.. ఇక్కడకు వస్తే..
- కె.వెంకటరత్నం, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ చీపినాపి, కలువాయి

మాది ఆత్మకూరు. వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలో పనిచేస్తున్నా. ఓటు వేసేందుకు ఆత్మకూరుకు వెళితే.. అక్కడ ఓటు లేదని చెప్పి.. నెల్లూరుకు వెళ్లమన్నారు. ఇక్కడకు వచ్చినా లేదు. ఎక్కడ ఉందో తెలియడం లేదు. నమోదు కూడా చేశారు. చివరకు తిరుపతిలో ఉందేమో వెళ్లి చూసుకోమని చెబుతున్నారు. ఇలాగైతే.. ఓటెలా వేయాలి.


ఎక్కడుందో చెప్పాలి
- రామారావు, కందుకూరు

కందుకూరు నుంచి వచ్చా. నెల్లూరులోని జడ్పీ హైస్కూల్‌లో ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. తీరా ఇక్కడి జాబితాలో పేరు లేదు. నాతోపాటు చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. సరిగా సమాధానం చెప్పేవారు కూడా లేరు. ఎవరిని కనుక్కోవాలో అర్థం కావడం లేదు. సొంత నియోజకవర్గంలో అవకాశం కల్పించి ఉంటే వినియోగించుకునేవాణ్ని. రెండు రోజుల కిందట ఓటు వేసుకోమని సంక్షిప్త సందేశం కూడా వచ్చింది.


ఓటేస్తానంటే.. ఫారం- 12 ఇచ్చారు
- శ్రీనివాసరావు, కందుకూరు

నాది ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం. కందుకూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్నా. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నా. సంక్షిప్త సందేశంలో.. అయిదో తేదీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పెట్టారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఓటు లేదు. తహసీల్దారును కలవమన్నారు. ఆయనకు ఫోన్‌ చేస్తే ఓట్లు నెల్లూరుకు పంపించామన్నారు. ఇప్పుడు ఫారం-12 ఇచ్చారు. రెండు రోజుల సమయమే ఉంది. మళ్లీ కందుకూరు నుంచి రావాలంటే ఇబ్బందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని