logo

జనం ఆస్తులపై జగన్‌ కుట్ర

ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది.  ‘ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Published : 07 May 2024 03:50 IST

కావలి, దుత్తలూరు, ఉదయగిరి, న్యూస్‌టుడే: ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది.  ‘ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వారసత్వంగా సంక్రమించిన,  పైసాపైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన స్థలాలు, పొలాలు తమవే అని సదరు యజమానులే నిరూపించుకోవాల్సిన పరిస్థితిని జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంపై  అన్నివర్గాల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.


దుర్మార్గమైన చట్టం

-దామా అంకయ్య, జిల్లా కార్యదర్శి, నెల్లూరు, సీపీఐ

భూ యాజమాన్య హక్కు చట్టం దుర్మార్గం. పేద, మధ్యతరగతి వర్గాల వారు కష్టపడి సంపాదించుకున్న స్థిరాస్తికైనా, తరతరాలుగా వచ్చే వంశపారంపర్య భూములపై యాజమాన్య హక్కు కోల్పోవడం దారుణం. కొన్నాళ్లు ఆస్తుల పర్యవేక్షణ పట్టించుకోకపోతే పరులపాలయ్యే ప్రమాదం ఉంది. ఏ రాష్ట్రంలోనూ ఈ చట్టం అమలు చేసేందుకు ముఖ్యమంత్రులు సిద్ధంగా లేరు. ప్రధాని మోదీకి దాసోహమైన ముఖ్యమంత్రి జగన్‌ ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పూనుకోవడం అన్యాయం.


నిరక్షరాస్యులైతే ఇబ్బందికరమే

- దమ్ము దర్గాబాబు, జిల్లా అధ్యక్షులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం

వ్యవసాయ కార్మికులు, సన్న, చిన్నకారు, కౌలు రైతుల్లో చాలామంది నిరక్షరాస్యులు. వారు యాజమాన్య హక్కు కోల్పోయే దుస్థితి ఉంది. ఇప్పటివరకు ఉన్న భూ హక్కు పత్రాలు ఇకపై అక్కరకు రావు. కేవలం టైట్లింగ్‌ అథారిటీ అధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రీసర్వేతో చాలా మంది పేద రైతులకే ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈచట్టం మరింత ప్రమాదకరం.


 రాజకీయ పెత్తనానికి ప్రాధాన్యం

- కాకు వెంకటయ్య, రైతు సంఘం నాయకుడు

ఈ చట్టంతో ఏ ప్రభుత్వం ఉంటే... వారికి ఇష్టమొచ్చిన భూములను ప్రజల నుంచి లాక్కునే ప్రమాదం ఉంది. ఆస్తి వివాదాలు వచ్చినపుడు కోర్టులకు వెళ్లే అవకాశం  ఉండదు. తీర్పు, పెత్తనం అధికారులదే.    


సీఎం అమలుచేయడం అమానుషం

-తన్నీరు మాల్యాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు, వ్యవసాయ కార్మిక సంఘం

ఎంత నిరుపేద కుటుంబానికైనా కొద్దోగొప్పో భూమి ఉంటే  భరోసా ఉంటుంది. వాటి  హక్కు పత్రాలు వారింట ఉండకపోవడం దారుణం. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సీఎం జగన్‌ దీన్ని అమలు చేయడం  అమానుషం.


నిరంతరం చూసుకోవాల్సిందే

- నరసింహారావు, రైతు, వరికుంటపాడు

ఈ చట్టంతో  భూమి పత్రాలకు విలువ లేకుండా చేస్తున్నారు. నిరంతరం భూ రికార్డుల వివరాలు పరిశీలించుకోవాల్సిన పరిస్థితి తెస్తున్నారు. ఎవరైనా కబ్జా చేసి వారి పేరుతో రికార్డులు పుట్టించుకుని మూడేళ్లు గడిస్తే అసలైన యజమాని ఆ భూమిపై హక్కు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అన్యాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని