logo

పురుడు పోస్తూ.. ప్రాణాలు నిలుపుతూ

గర్భిణులకు 108 సిబ్బంది ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ఫోన్‌ చేసిన వెంటనే వెళ్లి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నొప్పులు తీవ్రమైనా.. పరిస్థితి చేయిదాటుతున్నా 108 వాహనంలోనే పురుడుపోస్తున్నారు. అత్యవసర సమయంలో కాన్పులు చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందారు. వైద్యుల సూచనలు పాటిస్తూనే తల్లీబిడ్డలను సురక్షితంగా ఉంచుతున్నారు.

Published : 20 Jan 2022 02:40 IST

 108 అంబులెన్సులోనే అత్యవసర చికిత్సలు  

ప్రత్యేక శిక్షణతో చాకచక్యంగా
న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

108లో కాన్పు చేసి శిశువును అప్పగిస్తున్న సిబ్బంది

గర్భిణులకు 108 సిబ్బంది ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ఫోన్‌ చేసిన వెంటనే వెళ్లి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నొప్పులు తీవ్రమైనా.. పరిస్థితి చేయిదాటుతున్నా 108 వాహనంలోనే పురుడుపోస్తున్నారు. అత్యవసర సమయంలో కాన్పులు చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందారు. వైద్యుల సూచనలు పాటిస్తూనే తల్లీబిడ్డలను సురక్షితంగా ఉంచుతున్నారు.
పరిస్థితి చేయి దాటితే..
రోడ్డుప్రమాదాల్లో గాయపడిన వారి ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు నిలపడంతోపాటు.. పురిటినొప్పులు తీవ్రమై ప్రాణాపాయ స్థితిలో ఉండే గర్భిణులకు పురుడు పోస్తున్నారు. ఇందు కోసం వాహనంలో అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు, ఒక పైలెట్‌, డ్రైవర్‌ సేవలందిస్తున్నారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి చేయిదాటితే అప్పటికప్పుడు వాహనాన్ని నిలిపివేసి ప్రసవాలు చేస్తున్నారు. ఈ చికిత్సకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కాల్‌సెంటర్‌ ద్వారా వైద్యుల సూచనలు పాటిస్తూ తల్లీబిడ్డకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.
సౌకర్యాలు లేక వెతలు
సాధారణ కాన్పులకు అవకాశం లేని సమయంలో శస్త్రచికిత్స చేసేందుకు జిల్లాలో సరిపడా వసతులు లేవు. ప్రత్యేక స్త్రీ వైద్య నిపుణులు లేరు. అందుకు కావాల్సిన పరికరాలు, సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ కాన్పులయ్యే అవకాశమున్నా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. అన్ని కేసులను ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. రక్తహీనత, పేగు మెడకు చుట్టుకుని ఉండటం, శిశువు కాళ్లు ముందుకు రావడం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సైతం 108 సిబ్బంది త్వరగా ఆసుపత్రులకు తరలించి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడుతున్నారు.  
జాగ్రత్తలు పాటిస్తున్నాం
- అనిరుధ్‌, 108 జిల్లా సమన్వయకర్త , కామారెడ్డి

గర్భిణులను ఆసుపత్రికి తరలించే క్రమంలో పురిటినొప్పులు అధికమైతే అంబులెన్సులోనే ప్రసవాలు చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. కాల్‌సెంటర్‌ ద్వారా ప్రత్యేక వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. వారు అందిస్తున్న సేవలు ఎనలేనివి. ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సమీప ఆసుపత్రుల్లో చేర్చుతున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని