logo

వ్యూహాలు సిద్ధం... ఎవరికి దక్కేనో విజయం

సాధారణ ఎన్నికలు (2024) సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు (బిజద, భాజపా, కాంగ్రెస్‌) ముందస్తు వ్యూహాలు రచిస్తున్నాయి.

Published : 05 Oct 2022 02:29 IST

4 ఉప ఎన్నికల్లో బిజద విజయభేరి
ప్రధాన పార్టీల్లో సందడి నవంబరు
3న ధాంనగర్‌... తర్వాత పద్మపూర్‌లో
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

సాధారణ ఎన్నికలు (2024) సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు (బిజద, భాజపా, కాంగ్రెస్‌) ముందస్తు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంతలో ధాంనగర్‌ (భద్రక్‌ జిల్లా) అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల భేరీ మోగింది. తర్వాత పద్మపూర్‌ (బరగఢ్‌ జిల్లా) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దీంతో రాజకీయ సందడి నెలకొంది.

మృతులంతా అనుభవజ్ఞులే
2019లో 16వ శాసనసభ ఏర్పాటైంది. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఇంతవరకు 6 మంది మృతి చెందారు. వారంతా అనుభవజ్ఞులు, భారత రాజ్యాంగం, చట్టాలపై సమగ్ర అవగాహన ఉన్న వారు.
2020 జూన్‌ 17న బాలేశ్వర్‌ సదర్‌ భాజపా ఎమ్మెల్యే మదన మోహన్‌ దత్త తుదిశ్వాస విడిచారు.
2020 జులై 6న జగత్సింగ్‌పూర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బిష్ణుదాస్‌ మృతి చెందారు.
2020 అక్టోబరు 4న పూరీ జిల్లా పిపిలి బిజద ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రదీప్‌ మహారథి కన్ను మూశారు.
2021 డిసెంబరు 30న ఝార్సుగుడ జిల్లా బ్రజరాజనగర్‌ బిజద ఎమ్మెల్యే, శాసనసభ మాజీ సభాపతి కిశోర్‌ మహంతి ప్రాణాలు విడిచారు.
ఈ ఏడాది సెప్టెంబరు 19న భద్రక్‌ జిల్లా ధాంనగర్‌ భాజపా ఎమ్మెల్యే, విపక్ష ఉపనేత బిష్ణుశెఠి మృతిచెందారు.
ఈ ఏడాది అక్టోబరు 2 అర్థరాత్రి బరగఢ్‌ జిల్లా పద్మపూర్‌ బిజద ఎమ్మెల్యే మాజీ మంత్రి బిజయరంజన్‌ సింగ్‌ బరిహ కన్నుమూశారు.

ఉప ఎన్నికల్లో శంఖారావం
ఇంతవరకు జరిగిన 4 ఉప ఎన్నికల్లో బిజద గెలుపొందింది. బాలేశ్వర్‌, జగత్సింగ్‌పూర్‌, పిపిలి, బ్రజరాజనగర్‌ స్థానాల్లో బిజద అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో భాజపా ఖాతాలోకి వచ్చిన బాలేశ్వర్‌ సదర్‌ సీటునూ బిజద కైవసం చేసుకుంది.

ధాంనగర్‌, పద్మపూర్‌ సీట్లు కీలకం
గత సాధారణ ఎన్నికలకు ముందు ధాంనగర్‌, పద్మపూర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ధాంనగర్‌ స్థానానికి నవంబరు 3న ముహూర్తం ఖరారు చేసిన సంగతి విదితమే. కొద్ది రోజుల్లో పద్మపూర్‌ స్థానానికి షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఈ రెండు స్థానాలు ప్రధాన పార్టీలకు కీలకం కానున్నాయని పరిశీలకులంటున్నారు.


విశ్వరూపం చూపిస్తాం

భాజపా అగ్ర నేత, మాజీ మంత్రి మన్మోహన్‌ సామల్‌ మంగళవారం భద్రక్‌లో విలేకరులతో మాట్లాడుతూ ధాంనగర్‌, పద్మపూర్‌ ఉప ఎన్నికల్లో భాజపా విశ్వరూపం చూపిస్తుందన్నారు. ఈ రెండు సీట్లు కమలం ఖాతాలోకి వస్తాయని, రానున్న సాధారణ ఎన్నికల ముందు ఇది మినీ పోల్‌ అని పేర్కొన్నారు. తమ బలం నిరూపించుకుంటామన్నారు.


కచ్చితంగా గెలుస్తాం

పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి రోజులొచ్చాయని, రెండు సీట్లు గెలుస్తామని చెప్పారు. బిజద, భాజపాలు వేరు కాదని, రెండింటి మధ్య లోపయికారీ బంధం ఉందని తెలుసుకున్న ఓటర్లు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన నిలుస్తారన్నారు.


పదేపదే.. అదే

రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖల మంత్రి ప్రమీలా మల్లిక్‌ మంగళవారం జాజ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.... ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారీ భాజపా, కాంగ్రెస్‌ నేతలు గెలుపు వారిదేనని చర్వితచరణంగా చెప్పుకుంటున్నారని, ప్రజలు బిజద పక్షాన నిలుస్తున్నారని పేర్కొన్నారు. ధాంనగర్‌, పద్మపూర్‌ రెండింటినీ తామే గెలుస్తామని చెప్పారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని