logo

ప్రచారంలో తలమునకలు... సభలో కనిపించరు

అసెంబ్లీలో సభాపతి పోడియం వద్ద మంగళవారం భాజపా, కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Published : 30 Nov 2022 02:08 IST

మంత్రుల తీరుపై శాసనసభలో విపక్షాల ఆందోళన


పోడియం వద్ద విపక్ష సభ్యుల నిరసన

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీలో సభాపతి పోడియం వద్ద మంగళవారం భాజపా, కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భువనేశ్వర్‌లోని గాంధీ మార్గ్‌లో లక్షన్నర మంది ఉపాధ్యాయులు తమకు న్యాయం చేయమని కోరుతూ నాలుగు రోజులుగా ఉద్యమిస్తున్నా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. టీచర్ల ఆందోళనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సోమవారం సభాపతి బిక్రంకేసరి అరుఖ్‌ సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న నేతలు న్యాయం జరిగేవరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సాగనీయబోమని తేల్చిచెప్పారు. సభా కార్యక్రమాలకు సహకరించాలని భాజపా, కాంగ్రెస్‌ నేతలకు సభాపతి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో సభా కార్యక్రమాలు 11.30 తర్వాత సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి. పరిస్థితి చక్కదిద్దడానికి సభాపతి అఖిలపక్ష సమావేశం నిర్వహించినా ఫలితం కనిపించలేదు.

సభలో మంత్రులేరీ?

మంత్రులంతా పద్మపూర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో ఉంటే... టీచర్ల ఆందోళనపై ఎవరు సమాధానమిస్తారని సభలో భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి నిలదీశారు. విద్యాశాఖ మంత్రి సమీర్‌రంజన్‌ దాస్‌కు ఉపాధ్యాయుల ఆందోళన కంటే ఉపఎన్నిక ప్రచారం ముఖ్యమా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ నేత తారాప్రసాద్‌ బాహినీపతి మాట్లాడుతూ.. శాసనసభ కంటే ఎన్నికల ప్రచారం కీలకమైనప్పుడు, ఎందుకీ సమావేశాలని నిలదీశారు. సభాపతి సూచనను ఖాతరు చేయని పాలకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.


చర్చలు కొనసాగుతున్నాయి

సభలో శాస్త్ర, విజ్ఞాన, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అశోక్‌చంద్ర పండా మాట్లాడుతూ... ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రాథమిక విద్యాశాఖ ఉన్నతాధికారులు గురువులతో చర్చిస్తున్నారని చెప్పారు. రాత్రికి రాత్రి ఇది పరిష్కారమయ్యే అంశం కాదని, విపక్షాలు ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు.


విపక్షాలకు తగదు

బిజద అధికార ప్రతినిధి శశిభూషణ్‌ బెహరా మాట్లాడుతూ.. సభా కార్యక్రమాలను విపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగించడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని, వేచి చూడకుండా విమర్శలు చేయడం శోచనీయమన్నారు.


913 ఆరోగ్య కేంద్రాలకు రూ.1078 కోట్లు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో 913 ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, 2024 మార్చిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌ దాస్‌ చెప్పారు. మంగళవారం శాసనసభలో బిజద ఎమ్మెల్యే సౌమ్యరంజన్‌ పట్నాయక్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రాజెక్టు కింద 2022-24 సంవత్సరాలకు ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు రూ.1078.82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణాల తర్వాత వైద్యులు, సిబ్బంది నియామకంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తృతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.  


సభా కార్యక్రమాలు వాయిదా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: శాసనసభలో మంగళవారం సాయంత్రం కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఉపాధ్యాయుల ధర్నాపై ప్రభుత్వం మౌనంగా ఉందన్న విపక్షాలు న్యాయం చేయాలని సభలో భీష్మించుకు కూర్చున్నాయి. దీంతో సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌ కార్యక్రమాలను బుధవారానికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని