logo

ముక్తా పథకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు

రాష్ట్రంలో పట్టణ పేదలు, వలస కార్మికులకు కొవిడ్‌ పరిస్థితుల్లో జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య మంత్రి కర్మ తాత్పర అభియాన(ముక్తా) పథకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.

Published : 04 Feb 2023 03:08 IST

పథకం కింద ఇంకుడు గుంత, కాలువ నిర్మాణ పనుల్లో మహిళలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పట్టణ పేదలు, వలస కార్మికులకు కొవిడ్‌ పరిస్థితుల్లో జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య మంత్రి కర్మ తాత్పర అభియాన(ముక్తా) పథకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ వనరుల సంస్థ(డబ్ల్యూఆర్‌ఐ) రాస్‌ సెంటర్‌ ఫర్‌ సిటీస్‌ 2021-22 అవార్డుకు ముక్తా ఎంపికైంది. న్యూయార్క్‌లోని ఫోర్డ్‌ ఫౌండేషన్‌ సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ జి.మధివధనన్‌ ఈ అవార్డును స్వీకరించారు. దీనిపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ శాఖపై ప్రశంసల జల్లు కురిపించారు. కొవిడ్‌ పరిస్థితుల్లో పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ముక్తా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా పనిచేసిన అధికారులను అభినందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

65 దేశాల నుంచి దరఖాస్తులు: ఈ అవార్డు కోసం 65 దేశాలకు చెందిన 155 నగరాల నుంచి 260 దరఖాస్తులు చేరగా, వాటిలో రాష్ట్రానికి చెందిన ముక్తా  పథకం ఎంపికైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కింద ఇంతవరకు రాష్ట్రంలో 114 నగరాలు, పట్టణాల నుంచి 7 లక్షల మంది పేదలు, వలస కార్మికులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వ దస్త్రాలు పేర్కొంటున్నాయి. 22,500 సామాజిక స్థాయి అభివృద్ధి పనులు (రూ.208 కోట్లు) కోసం వీరంతా వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరితో పాటు 5,368 మిషన్‌ శక్తి బృందాలు, 438 బస్తీ వాసుల సంఘాలు ఇందులో భాగస్వాములైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పథకం కింద కాలువలు, సామాజిక కేంద్రాలు, వాననీటి సంరక్షణ కట్టడాలు, తదితర నిర్మాణాలతో పాటు మొక్కలు నాటడం, నీటి వనరుల పునరుద్ధరణ వంటి పనులకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవార్డు స్వీకరణ కార్యక్రమంలో మధివధనన్‌తో పాటు పట్టణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి శారదాప్రసాద్‌ పండా పాల్గొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అవార్డు స్వీకరిస్తున్న మధివధనన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని