logo

మాకొద్దు సాగునీటి ప్రాజెక్టు

ప్రభుత్వం.. ఆ గ్రామంలో మరో 10 రోజుల్లో నీటిపారుదల ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న తరుణంలో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

Published : 24 Mar 2023 01:53 IST

రైతులు, గ్రామస్థుల నిరసన  

ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్న గ్రామస్థులు

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం.. ఆ గ్రామంలో మరో 10 రోజుల్లో నీటిపారుదల ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న తరుణంలో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతంలో గురువారం నినాదాలు చేశారు. ప్రాజెక్టు కోసం తమ భూములు ఇవ్వలేమన్నారు. నవరంగపూర్‌ జిల్లా జొరిగావ్‌ సమితి చచర పంచాయతీ గబాగూడ గ్రామంలో సతీ నది వద్ద సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని స్థానికులు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుత బిజద నేత ప్రదీప్‌ మాఝి ఇరవై ఏళ్ల క్రితం దాదాపు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేయడంతోపాటు చాలాసార్లు రాస్తారోకో చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇటీవల 5టీ కార్యదర్శి వీకే పాండ్యన్‌ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లారు. ఇంకొన్ని రోజుల్లో అనుమతులు వస్తాయని హామీ కూడా ఇచ్చారు. కల నిజమైన రోజు సమీపిస్తోందని, ఆనంద పడేలోపు వ్యతిరేకత వ్యక్తమైంది. వీకే పాండ్యన్‌ వచ్చినప్పుడు 5 పంచాయతీలకు చెందిన వందలాది మంది గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. హఠాత్తుగా గురువారం ఉదయం తమ భూములు ఇచ్చేది లేదని పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్‌ మాఝి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం తాను చాలా కృషి చేశానని, పలుమార్లు అధికారులతో చర్చించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. రెండు రోజుల క్రితం అక్కడి గ్రామాల్లో పర్యటిస్తే అంతా సంతోషం వెలిబుచ్చారని, ఇంతలోనే నిరసన చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది విపక్ష పార్టీల కుట్ర అని ఆరోపించారు. గ్రామస్థులకు నచ్చజెపుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని