logo

నేర వార్తలు

బాలేశ్వర్‌ జిల్లా సిమ్ములియా పోలీస్‌ స్టేషన్‌ ఛత్రపూర్‌ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్నవాడే భార్యను హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Published : 30 Mar 2023 03:07 IST

భార్యను హతమార్చిన భర్త

కటక్‌, న్యూస్‌టుడే: బాలేశ్వర్‌ జిల్లా సిమ్ములియా పోలీస్‌ స్టేషన్‌ ఛత్రపూర్‌ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్నవాడే భార్యను హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం..ఛత్రపూర్‌ గ్రామంలో కునిసింగ్‌, వీర సింగ్‌ భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఇద్దరు కలిసి సామగ్రి కొనుగోలు చేయడానికి మార్కెట్‌కి వెళ్లారు. తిరిగి వచ్చే దారిలో ఆమెను హత్య చేశాడు. గ్రామ సమీపంలోని పొలంలో కునిసింగ్‌(50) మృతదేహం చూసిన గ్రామస్థులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని భర్త సింగ్‌ను విచారణ చేయగా నిజం వెలుగులోకి వచ్చింది.


21 కిలోల గంజాయి పట్టివేత

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నందపూర్‌ నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఠాణా అధికారి పీకే మహాపాత్ర్‌ అందించిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం రావడంతో మంగళవారం రాత్రి రాజ్‌ ఫుట్‌ కూడలి వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. నందపూర్‌ నుంచి వస్తున్న ఒక కారులో చూడగా 21 కిలోల గంజాయి గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేశారు.


గంజాయి రవాణాలో ఇద్దరి అరెస్టు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: కారు నంబరు ప్లేట్లు మార్చి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గజపతి జిల్లా మోహన సమితి అడవా ఠాణా ఎస్సై భాగ్యలత దాస్‌ నల్లఘాట్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పెర్మగూడ వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 114 కిలోలు సరకు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకుని, నకిలీ నెంబర్‌ ప్లేట్‌తో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లలోని ఫతేపూర్‌కు సరకు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితులు ఫతేపూర్‌కు చెందిన అవినాష్‌ మౌర్య, దీపక్‌ కుమార్‌లుగా గుర్తించి కేసు నమోదు చేశారు.


పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీ

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలో వరుస దొంగతనాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పట్టణ శివారులోని గుసాని సమితిలోని స్థానికంగా ఉన్న మిశ్ర కాంప్లెక్స్‌లో బుధవారం వేకువజామున ద్విచక్ర వాహనం చోరీ జరిగింది. బాధితులు ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ పుటేజ్‌ని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ముఖానికి తువాలు చుట్టి వాహనాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.


సమితి అధికారిణిపై దాడి ఘటన
ఆమె తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు

కటక్‌, న్యూస్‌టుడే: సుందర్‌గడ్‌ జిల్లా కోయిడ సమితి అధికారిని పల్లవి రాణిరాజ్‌పై దాడి ఘటనలో పోలీసులు ఆమె తండ్రి రమేష్‌ రాజ్‌ను అరెస్టు చేశారు. సోదరుని కోసం గాలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సమితి అధికారిణి సోదరుడు గుత్తేదారుగా ఉన్నాడు. మంగళవారం సమితి అధికారి పల్లవి రాణి రాజ్‌ తన కార్యాలయంలో ఉన్న సమయంలో తండ్రి రమేష్‌ రాజ్‌ సోదరుడు కార్యాలయం వచ్చి ఆమెపై దాడి చేశారు. అనంతరం రమేష్‌ రాజ్‌, సోదరుడు పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని తండ్రిని అరెస్టు చేశారు. గుత్తేదారుగా ఉన్న సోదరుడు బకాయిల చెల్లింపు విషయంలో సమితి అధికారిణిపై దాడికి దిగిన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తెలింది.


కారుపై నాటుబాంబుతో దాడి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని నృసింహ మందిరం సమీపాన శంఖారివీధిలోని బీఈఎంసీ వార్డు కార్పొరేటరు చిత్రసేన మహాపాత్ర్‌ ఇంటి బయట సోమవారం అర్ధరాత్రి నాటుబాంబుతో దాడి జరిగింది. గుర్తు తెలియని వారు ఇంటి బయట నిలిపి ఉన్న కారుపై బాంబు దాడి చేశారని కార్పొరేటరు మహాపాత్ర్‌ ఫిర్యాదు చేశారని ఠాణా ఐఐసీ ప్రశాంత భూపతి బుధవారం సాయంత్రం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


అర్ధాంగిని చంపిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష

కటక్‌, న్యూస్‌టుడే: భార్యను హత్య చేసిన వ్యక్తికి కటక్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2016 ఏప్రిల్‌ 21వ తేదీన కట్ట సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అరడి గ్రామానికి చెందిన కాలియా మల్లిక్‌కు, భార్య సరస్వతికి కుటుంబ విషయమై ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వారి ఇద్దరు పిల్లల ఎదుటే ఆమెను హత్య చేయడంతోపాటు చేతులు నరికి బయటకు విసిరేశాడు. ఈ ఘటనపై సరస్వతి పుట్టింటివారు ఫిర్యాదు చేయడంతో కాలియా మల్లిక్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై మంగళవారం కోర్టు విచారణ చేసి పైవిధంగా శిక్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని