logo

దాహం కేకలు

రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు.

Published : 28 Mar 2024 04:33 IST

గుక్కెడు నీటి కోసం ప్రజలు కటకట

పైపుల ద్వారా నీటిని సేకరిస్తున్న మహిళలు

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పద్మపురం సమితి పరిమా గ్రామంలో 70 నుంచి 75 కుటుంబాలు, 350 మంది జనాభా ఉంటున్నారు. తాగునీరు దొరక్క వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు గొట్టపు బావులున్నా, అవి దీర్ఘకాలంగా పని చేయడం లేదు. మరమ్మతులు చేయాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రస్తుత సిటింగ్‌ ఎమ్మెల్యే రఘునాథ్‌ గమాంగ్‌, జిల్లా బిజద అధ్యక్షుడు సుధీర్‌ దాస్‌ గ్రామంలో జరిగిన సమావేశంలో పాల్గొని నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న దిగుడు బావి వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అందులోనూ నీరు తగ్గుముఖం పడుతోంది. దీంతో గతేడాది గ్రామస్థులంతా సమావేశమై ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముండిగట గ్రామం కొండ పైనుంచి ప్రవహిస్తున్న వాగు వద్ద అడ్డుగా మట్టి వేసి నీటిని నిల్వ చేశారు. చందాలు వేసుకుని పైపులు అమర్చుకుని గ్రామానికి నీటి సరఫరా చేసుకున్నారు.

కొండలపై పైపులు బిగిస్తున్న యువకులు


నీటి సమస్య పరిష్కరించాలి: కొండపైకి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం కష్టమవుతోంది. పైపుల ద్వారా తక్కువ నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలి. దీర్ఘ కాలంగా నీటి కోసం నానా అవస్థలు పడుతున్నాము. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కారం కావడంలేదు.

జమునా మాఝి, గ్రామస్థురాలు.


రోగాల బారిన పడుతున్నాం: కొండలపై నీరు కలుషితంగా ఉంది. వేడి చేసి తాగుతున్నా రోగాల బారిన పడుతున్నాము. గొట్టపు బావులు పనిచేయడం లేదు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.  

జంభూ మాఝి, గ్రామస్థురాలు.


పరిమా గ్రామం నీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ, సమితి సమావేశాల్లో ప్రస్తావించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరు అజయ్‌కుమార్‌ మాఝితో మాట్లాడగా పరిమా గ్రామంలో నీటి సరఫరా కోసం ప్రాజక్టు ప్రతిపాదనలో ఉందన్నారు. వసుధ యోజనలో భాగంగా ట్యాంక్‌ ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి కుళాయిల ద్వారా నీటిసరఫరా చేస్తాం.  

మమతా మాఝి, నువాగడ సర్పంచి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని