logo

మహిళా ఓటర్లే అత్యధికం

రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్‌సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు.

Published : 20 Apr 2024 03:01 IST

నాలుగు లోక్‌సభ స్థానాల్లో 7,289 బూత్‌ల ఏర్పాటు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్‌సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. రాజధానిలో గురువారం అఖిల పక్ష నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొరాపుట్‌, కలహండి, బ్రహ్మపుర, నవరంగపూర్‌ లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారన్నారు. ఈ నాలుగు స్థానాల్లో 7,289 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు మరో 14 సహాయక పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ధొళో వెల్లడించారు. ఈ నాలుగు లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 62,84,649 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 31,87,771 మంది మహిళలు, 30,96,243 పురుషులు, 635 మంది హిజ్రాలు ఉన్నట్లు సీఈవో స్పష్టం చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘనల కింద 3,873 ఫిర్యాదులు అందాయని పేర్కొన్న నికుంజ బిహారీ, వీటిలో 3,854 పరిష్కరించామన్నారు.


రూ.118.65 కోట్ల విలువ సామగ్రి సీజ్‌

న్నికల ముందు రాష్ట్రంలో రూ.118.65 కోట్ల విలువ చేసే మద్యం, మత్తు పదార్థాలు, నగదు తదితరాలను సీజ్‌ చేసినట్లు సీఈవో వెల్లడించారు. మార్చి 1 నుంచి ఇంతవరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్న ధొళో, వీటిలో పోలీసు యంత్రాంగం రూ.61.6 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలు, మద్యం, నగదు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అబ్కారీ శాఖ పరిధిలో రూ.30 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలు స్వాధీనం కాగా, రాష్ట్ర జీఎస్టీ శాఖ రూ.17 కోట్లు, ఆదాయం, ఇంటిలిజెన్స్‌ విభాగాల పరిధిలో రూ.6.4 కోట్లు, రవాణాశాఖ రూ.1.19, ఆదాయపన్ను శాఖ రూ.73 లక్షల విలువ చేసే పలు సామగ్రి, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. వీటితో పాటు అటవీ శాఖ పరిధిలో రూ.95 లక్షలు స్వాధీనం చేసినట్లు నికుంజ బిహారీ ధొళో గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని