logo

నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్‌ రాక

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు.

Published : 05 May 2024 04:00 IST

రేపు బ్రహ్మపుర, నవరంగపూర్‌లలో బహిరంగ సభలు

 

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఆదివారం ఉదయం బ్రహ్మపుర చేరువలోని గోపాల్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొణిసి వద్ద ఏర్పాటయ్యే భాజపా విజయ సంకల్ప ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు నవరంగపూర్‌ చేరుకుని మరో బహిరంగ సభలో పాల్గొంటారని భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్‌ మహాపాత్ర్‌ శనివారం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు.

  భాజపా శ్రేణుల్లో ఉత్సాహం

ఎన్నికల భేరీ మోగిన తర్వాత తొలిసారిగా మోదీ రాష్ట్రానికి వస్తున్నందున భాజపా శ్రేణుల్లో ఉత్సాహం కనిపిప్తోంది. ఆయన ఏం చెబుతారన్న దానిపై ప్రజల్లోనూ ఉత్కంఠ ఉంది.  రాష్ట్రానికి ప్రధాని మోదీ చాలాసార్లు వచ్చారు. అలా వచ్చినపుడు ఆయన నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. గతసారి (2019) ఎన్నికల సమయంలోనూ ఆయన సంయమనం పాటించారు. ఈసారి ఈ పరిస్థితి ఉండకపోవచ్చునని, వైఫల్యాలు ఎండగట్టే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. ఇటీవల దిల్లీలో ఒక టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఒడిశా ప్రతిష్ఠ మసకబారిందని, ప్రగతి ఫలాలు ప్రజల ముంగిళ్లకు చేరడం లేదని ఆయన విమర్శించారు. పాలన మారాలని, పనులు చేసే ప్రభుత్వం అధికారంలోకి రావాలని అంతా కోరుతున్నారన్నారు. ఇది భాజపా వల్లే సాధ్యమన్న ఆశాభావం ఓటర్లలో ఉందని మోదీ చెప్పారు.

12 సభల్లో పాల్గొననున్న మోదీ

ఒడిశాలో నాలుగు విడతల పోలింగ్‌ (ఈ నెల 13, 20, 25, జూన్‌ 1న) నిర్వహించనుండగా ఈ నెల 30 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ప్రధాని మోదీ 12 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని, నెలాఖరు వరకు రాష్ట్రానికి తరచూ వస్తారని భాజపా అధికార వర్గాలు శనివారం తెలిపారు. ఈ నెల 10 సాయంత్రం భువనేశ్వర్‌కు రెండోసారి రానున్న ప్రధాని రాజధానిలో రోడ్‌షో నిర్వహిస్తారు. 12న భవనేశ్వర్‌, బొలంగీర్‌లలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మరోవైపు ఆదివారం రాత్రి తొలి పర్యటన ఖరారు కాగా, భువనేశ్వర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. రాజ్‌భవన్‌లో మోదీ రాత్రి విడిది చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని