logo

కనిపించే దేవుడు.. వైద్యుడు

వైద్యో నారాయణ హరి అంటారు.. మనిషికి జీవం పోసేది ఆ పరమాత్ముడు అయితే.. పునర్జన్మ పోసేది వైద్యుడే. ఆపదలో ఉన్న వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ఊపిరి పోస్తాడు. అందుకే దేవుడిలా పూజిస్తారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు వైద్య వృత్తికే అం

Published : 01 Jul 2022 04:51 IST

నేడు డాక్టర్స్‌ డే

రింగురోడ్డు, న్యూస్‌టుడే

వైద్యో నారాయణ హరి అంటారు.. మనిషికి జీవం పోసేది ఆ పరమాత్ముడు అయితే.. పునర్జన్మ పోసేది వైద్యుడే. ఆపదలో ఉన్న వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ఊపిరి పోస్తాడు. అందుకే దేవుడిలా పూజిస్తారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు వైద్య వృత్తికే అంకితం అయ్యాయి. ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారిపై కథనం.

ఆ ముగ్గురే స్ఫూర్తి

కేంద్రాసుపత్రిలో ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి కేవీ మురళీమోహన్‌, భార్య అరుణ లండన్‌లో గైనకాలజిస్టుగా, కుమారుడు సిదార్థ ఈఎన్‌టీ నిపుణులుగా అమెరికాలో ఉన్నారు. కుమార్తె మేఘన ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తన మేనత్తలు సావిత్రి, నళిని, చిన్నాన్న దుర్గాదాస్‌ వైద్య వృత్తిని ప్రజా సేవగా భావించే వారని, వారిని చూసి 50 కుటుంబాల్లో 30 మంది వైద్యులు అయ్యారని మురళీమోహన్‌ పేర్కొన్నారు.


చల్లని చూపు..

ఉత్తరాంధ్రలో కంటి వైద్య నిపుణుల్లో ఒకరు మంచు కుమార్‌ స్వామి. 35 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. 22 ఏళ్లపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశారు. సొంత జిల్లా శ్రీకాకుళంలోని గుత్తావళి, పురుషోత్తపురం, కొరసవాడ గ్రామాలను దత్తత తీసుకొని ఉచితంగా శస్త్రచికిత్సలు, ఉచిత వైద్య పరీక్షలు చేస్తూ మందులు  అందిస్తున్నారు. విజయనగరం  జిల్లాలోనూ విశేష సేవలందిస్తున్నారు. వందలాది వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి కంటిచూపు కోల్పోయిన వారికి శస్త్రచికిత్సలు చేసి చూపును ప్రసాదించారు. 2007లో ఉత్తమ కంటి వైద్య నిపుణులుగా అప్పటి ప్రభుత్వం  సత్కరించింది. ఈయన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు వైద్యులే.


ఐదు కుటుంబాల నుంచి..

తన ఇంట్లో వైద్యులు ఉంటే పది మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుందని బొండపల్లి మండలం నెలివాడకు  చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అప్పలకొండ, ఎస్‌బీ.నాయుడు ముగ్గురు పిల్లలను వైద్యులు చేశారు. ఇందులో ఎస్‌ఎస్‌ రవీంద్రబాబు శ్రీకాకుళం వైద్య కళాశాలలో జనరల్‌ సర్జన్‌, అసిస్టెంటు ప్రొఫెసర్‌గా, ఎస్‌ఎస్‌ఆర్‌.నాగేంద్రబాబు కేజీహెచ్‌లో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా, అమరేంద్రబాబు విశాఖలో రక్తనాళాల నిపుణులుగా సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో రక్తనాళాల నిపుణుల్లో ఈయన ఒకరు. నాగేంద్రబాబు, అమరేంద్రబాబు భార్యలు కూడా వైద్యులే. వీరే స్ఫూర్తిగా నెలివాడలో మరో అయిదు కుటుంబాల నుంచి వైద్యులు తయారయ్యారు.


అమ్మ కోరిక మేరకు..

తల్లి కోరిక మేరకు వైద్యురాలయ్యారు విజయనగరం డీఎంహెచ్‌వో రమణకుమారి. ఆమె సొంతూరు కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఉయ్యూరు. ‘అమ్మ నాగేశ్వరి గృహిణి, బీఏ చదివారు. నాన్న ఎస్‌.గంగయ్య రైల్వే అధికారి. చెల్లి సుగుణ. తండ్రి రైల్వే ఉద్యోగి కాబట్టి, ఎప్పుడూ బదిలీల మీదే చదువు కొనసాగేది. రాత్రి పూట నన్ను, చెల్లిని నిద్ర పుచ్చుతూ అందరికీ వైద్యం అందుబాటులోకి వస్తే.. మాతృమూర్తి గర్భశోకం తప్పుతుందని చెప్పేవారు. దీంతో ఇద్దరం మెడిసిన్‌లో చేరాం. అప్పటి వరకు అమ్మమ్మ, నాన్నమ్మ కుటుంబాల్లో ఎవరూ వైద్యులు లేరు. ఆ తర్వాత మా పాప, మా చెల్లి, మేనకోడలు, మరికొందరు అలా మొత్తం 15 మంది వరకూ వైద్యులమయ్యాం’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని