logo

రూ.వెయ్యితో సరిపెట్టేశారు..!

కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసినా నిధుల కేటాయింపుపై అధికారుల్లో స్పష్టత లోపించింది. ఏ ప్రాతిపదికన నిధులివ్వాలో తెలియక వారు సతమతం అవుతున్నారు.

Published : 30 Jan 2023 03:18 IST

పాత జిల్లాల నుంచి రాని మూలధనం
కార్యకలాపాల నిర్వహణకు మహిళా సమాఖ్యలకు అవస్థలు
పార్వతీపురం, న్యూస్‌టుడే

కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసినా నిధుల కేటాయింపుపై అధికారుల్లో స్పష్టత లోపించింది. ఏ ప్రాతిపదికన నిధులివ్వాలో తెలియక వారు సతమతం అవుతున్నారు. ఆర్థిక పరమైన అధికారాలు లేకపోవడంతో జిల్లా సమాఖ్యకు అధ్యక్ష, కార్యదర్శులుగా నియమితులైన వారు ఎలాంటి పనులు చేసేందుకు వీలు లేకుండా పోతోంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో 15 మండలాలున్నాయి. వీటిలో నాలుగు శ్రీకాకుళం, 11 విజయనగరం నుంచి విడిపోయాయి. దీంతో పార్వతీపురం మన్యంలో 566 గ్రామైక్య సంఘాలు, 19,501 స్వయం సహాయక సంఘాల్లో 2,25,667 మంది సభ్యులుగా మిగిలారు. వీరందరినీ కలిపి జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం వీటికి ఆర్థిక బలం లేకుండా పోయింది. పాత జిల్లాల నుంచి ఆయా మండలాలకు సంబంధించిన వాటాధనం విడుదల చేసి నిధులు ఇవ్వాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమాఖ్యల్లో ఒక్కో దానిలో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఉంటాయని, ఈ లెక్కన పార్వతీపురం మన్యంకు సుమారు రూ.2 కోట్లయినా వాటా ధనం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికోసం డీఆర్‌డీఏ నుంచి పాత జిల్లాలకు లేఖలు రాసినా స్పందన రాలేదు.


ఉందన్న మాటే కానీ..

జిల్లాలో సమాఖ్య ఏర్పాటు తర్వాత నాలుగు నెలల క్రితం కురుపాం మండలం లేవిడి, వీరఘట్టం, బలిజిపేట మండలాల నుంచి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నారు. వీరి పేరుతో ప్రారంభంలో రూ.1000తో బ్యాంకు ఖాతా ప్రారంభించారు. అంతకు మించి ఖాతాలో ఇప్పటి వరకు నిధులేవీ జమకాలేదు. దీంతో మండల సమాఖ్యలకు రుణాలు ఇచ్చేందుకు వీరి వద్ద ఎలాంటి సొమ్ములు లేకుండా పోయాయి. అవసరానికి కింది స్థాయి సమాఖ్యల నుంచే నగదు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.


నాలుగు నెలలైనా..
- సుజాత, మేరీ, కార్యదర్శి, కోశాధికారి, జిల్లా మహిళా సమాఖ్య

జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని నాలుగు నెలలైంది.  ఏ కార్యక్రమైనా మా ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ ఖాతాలో నిధులు లేకపోవడంతో ప్రయాణ భత్యాలను మండల సమాఖ్యల నుంచి తీసుకుంటున్నాం. పాత జిల్లాల నుంచి మండలాల వాటా ధనం ఇంకా రాలేదు. గిరిజన మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులు మాత్రమే చెక్‌పవర్‌ వినియోగిస్తున్నారు. జెడ్‌ఎంఎస్‌ అంతంతమాత్రంగానే ఉంది.  


సెర్ప్‌ ఆదేశాలకు ఎదురుచూపు
- వై.సత్యంనాయుడు, ఏపీడీ, టీపీఎంయూ, పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా సమాఖ్యకు నిధులు కేటాయించాలని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సమాఖ్యలకు లేఖలు రాశాం. విజయనగరం డీఆర్‌డీఏలో దీనిపై చర్చించినట్లు సమాచారం ఉంది. మా లేఖను ప్రస్తావిస్తూ సెర్ప్‌కు లేఖ కూడా రాసినట్లు తెలిసింది. అక్కడ నుంచి అనుమతులు వస్తే జిల్లాకు నిధులు అందుతాయి. యథాతథంగా కార్యకలాపాలు జరిగే వీలుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని