logo

ఓస్‌ అదెంత.. ఆక్రమించేయ్‌.. ఇల్లు నిర్మించేయ్‌

జిల్లా కేంద్రం పార్వతీపురంలో కీలక ప్రజాప్రతినిధి అండదండలు, ప్రోత్సాహంతో ఆయన అనుచరులు ప్రభుత్వ చెరువులపై కన్నేశారు.

Published : 02 Jun 2023 02:45 IST

జిల్లా  కేంద్రంలో చెరువులన్నీ కబ్జా
ప్రజాప్రతినిధి అండతో నిర్మాణాలు
ఈనాడు, పార్వతీపురం మన్యం, పార్వతీపురం, న్యూస్‌టుడే

అయ్యా..
ఫలానా చెరువు ఉంది..
అందులోని కాస్త స్థలంలో ఓ ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నా..
ఓస్‌.. అంతేనా..  నేనున్నా..
ఆక్రమించుకో.. కట్టుకో..

జిల్లా కేంద్రం పార్వతీపురంలో కీలక ప్రజాప్రతినిధి అండదండలు, ప్రోత్సాహంతో ఆయన అనుచరులు ప్రభుత్వ చెరువులపై కన్నేశారు. పూర్వం నుంచి పట్టణం, శివారు పంచాయతీల పరిధిలో ఉన్న సుమారు 40కి పైగా చెరువులు, గెడ్డలను వారు మింగేస్తుండ టంతో  రూపురేఖలు కోల్పోతున్నాయి.

రెవెన్యూ రికార్డుల్లో చెరువులుగా ఉన్నప్పటికీ వాటి సమీపంలోని జిరాయితీ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అధికారులిచ్చిన నోటీసులను ఆక్రమణదారులు ఖాతరు చేయడం లేదు. పైగా  నిర్మాణాలు కొనసాగించడం గమనార్హం.

అన్నీ అక్రమాల లంకెలే

బాలగుడబ పంచాయతీ పరిధిలోని లంకెల చెరువు అతిపెద్దది. సర్వే నం.15లో 51.22 ఎకరాల  విస్తీర్ణంలో ఉంది. ఇదంతా పట్టణ పరిధిలోని వైకేఎం కాలనీకి ఆనుకుని ఉండటం వల్ల సగానికి పైగా ఆక్రమణకు గురైంది. అందులో భారీ భవనాలు వెలిశాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ చదరపు గజం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. పట్టణానికి చెందిన వ్యాపారులు మరో సర్వే నంబరు వేసి రిజిస్ట్రేషన్లు చేయించుకొని పూర్తిగా కప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక బడా నేత హస్తం ఉందని చెబుతున్నారు. కబ్జాకు గురైన చెరువు గర్భం విలువ రూ.50 కోట్ల పైనే ఉంటుంది.

నెల్లి కోనేరును మింగేశారు

పార్వతీపురంలో విలువైన ప్రాంతంగా చర్చి వీధికి గుర్తింపు ఉంది. ఇక్కడ చదరపు గజం రూ.15 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వీధిని ఆనుకొని ఉన్న సర్వే నం.401లో 11.54 ఎకరాల విస్తీర్ణంలో నెల్లిచెరువు సగానికి పైగా కబ్జాదారుల చేతుల్లో ఉంది. దీని ముందున్న సుందరనారాయణపురం కాలనీలో ఇళ్లను అనుసరించి ఉన్న చెరువును రోజురోజుకు కొద్దికొద్దిగా కప్పేస్తున్నారు. 2004లో చెరువులో నిర్మిస్తున్న ఇంటిని అప్పటి రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇప్పుడు భారీ భవనాలు నిర్మిస్తున్నా కిమ్మనలేకపోతున్నారు. ఈ చెరువు గర్భంలోనే ప్రజాప్రతినిధుల అండతో కొన్ని సామాజిక వర్గాల సంఘ భవనాలు నిర్మిస్తున్నా ప్రశ్నించే వారే కరవయ్యారు.

రూపుమారిన కోదువాని బంద

ఎస్‌ఎన్‌పురం కాలనీ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 573-2లో కోదువాని బంద ఉంది. దీని విస్తీర్ణం 3.85 ఎకరాలు. పార్వతీపురం - విజయనగరం ప్రధాన రహదారిపై, కొరాపుట్ రోడ్డు కలిసే మూడు రోడ్ల కూడలిలో చెరువు ప్రాంతం ఉండడంతో విలువైన వాణిజ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. 2014 తర్వాత దీని రూపురేఖలు మారిపోయాయి. కొంత ప్రాంతాన్ని ఒక సామాజిక వర్గం వారికి ఇళ్ల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధి అనుమతిచ్చేశారు.

అటు అమ్మకాలు

కొత్తవలస రెవెన్యూ పరిధిలో రాయివానిబంద ఉంది. దీని విస్తీర్ణం 2.86 ఎకరాలు కాగా రాజకీయ నాయకులే కబ్జా చేశారు. చెరువును జిరాయితీ భూమిగా మార్చేసి క్రయవిక్రయాలకు శ్రీకారం చుట్టారు. పార్వతీపురం బైపాస్‌ రోడ్డులోని కామయ్యబంద సైతం ఆక్రమణకు గురైంది. నీరున్నా మట్టిపోసి కప్పేస్తూ జిరాయితీ భూమిగా నమ్మిస్తున్నారు. వరహాలగెడ్డ గట్టును సైతం మింగేస్తున్నారు. లక్ష్మీనారాయణపురం నుంచి పట్టణంలోకి వచ్చే వరహాలగెడ్డ మధ్యలోనే ఆక్రమణకు గురైంది. ఇక్కడ పక్క సర్వే నంబర్లు వేసి విక్రయిస్తున్నారు.

దేవునిబంద మాయం

పట్టణంలోని దేవునిబంద 343 సర్వే నంబరులోని 4.93 ఎకరాల్లో ఉంది. ప్రస్తుతం ఆనవాళ్లు కూడా లేవు. రోజుకో కొత్త నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ స్థలం చదరపు గజం ధర రూ.15 వేలకు పైగా  పలుకుతోంది.

ఆ స్థలాల్లో అనుమతులు ఏవీ?

ప్రభుత్వ చెరువులు ఆక్రమించుకుని.. ఆపై భవనాలు నిర్మించుకుంటున్నారు. పట్టణ పరిధిలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే పురపాలక సంఘం అనుమతి తప్పనిసరి. ఆక్రమిత స్థలాల్లో ఎక్కడా నిర్మాణాలకు అనుమతులు లేవు. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు కలిసి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


సర్వే చేసి హద్దురాళ్లు వేయిస్తాం

 - హేమలత, ఆర్డీవో  

పట్టణంలో చెరువుల ఆక్రమణల వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. వీటి సంరక్షణకు కలెక్టర్‌.. వీఆర్వో, కానిస్టేబుళ్లతో కమిటీలను నియమించారు. చెరువులను సర్వే చేసి హద్దురాళ్లు వేస్తాం. ఆక్రమణదారులకు నోటీసులిస్తాం. చెరువు గర్భాల్లో నిర్మించే ఇంటికి దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్తు మీటరు ఇవ్వొద్దని, భూమి రిజిస్ట్రేషన్ల సమయంలోనూ సర్వే నంబర్లు పరిశీలించాలని ఆయా శాఖలకు లేఖలు రాశాం.   


స్పందనలో ఫిర్యాదు చేశాం

- ఎం.సింహాద్రినాయుడు, చెరువు ఆయకట్టు రైతు

లంకెల చెరువులో 15 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారు. సర్వే నంబర్లు 16, 17, 18, 19 వేసి గజం రూ.8 వేల నుంచి రూ.10 వేలకు అమ్మేస్తున్నారు. స్పందనలో నాతో పాటు చాలా మంది రైతులు ఫిర్యాదు చేశారు. 2015 నుంచి పోరాడుతున్నా అధికారుల్లో స్పందన లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు