logo

కక్ష గట్టి.. కుప్పకూల్చి

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ద్వారపూడి వద్ద ఏర్పాటు చేసిన ఒక మెగావాట్‌ సౌర విద్యుత్తు ప్లాంటు మరుగున పడిపోయింది.

Published : 16 Apr 2024 05:40 IST

సౌర విద్యుత్తు ప్లాంటుపై వైకాపా అక్కసు
తెదేపా హయాంలో ఏర్పాటు కావడంతో నిర్వహణ గాలికి
అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే మరిచిపోయిన ప్రభుత్వం

ద్వారపూడి కొండపై పూర్తిగా కనుమరుగవుతున్న ప్లాంటు

‘నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాం. అన్ని సమస్యలనూ పరిష్కరించాం. మరోసారి నాకు అవకాశం ఇవ్వండి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా’ ఉప సభాపతి, వైకాపా విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తరచూ చెప్పే మాటలివి.

వాస్తవం: క్షేత్రస్థాయిలో ఆయన మాటలకు పొంతన కుదరడం లేదు. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే తెదేపా హయాంలో ఏర్పాటైన సౌర విద్యుత్తు ప్లాంటుపై కన్నేసిన ఆయన.. దాని నిర్వహణను పట్టించుకోకుండా కక్ష గట్టారు. తాను ఉంటున్న నగరంలోనే ప్రజలు, నగరపాలక సంస్థకు ఎంతో మేలు చేకూర్చిన ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయని ఆయన ఉన్న ప్లాంటునే మూలకు తోసేశారు.

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ద్వారపూడి వద్ద ఏర్పాటు చేసిన ఒక మెగావాట్‌ సౌర విద్యుత్తు ప్లాంటు మరుగున పడిపోయింది. దీంతో పట్టణ వాసులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కావడమే దీనికి శాపంగా మారిందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దాదాపు నాలుగేళ్ల నుంచి ఇక్కడ ఉత్పత్తి నిలిచింది. దీంతో నగరపాలికకు రూ.కోట్లలోనే నష్టం వాటిల్లుతోంది. విద్యుత్తు ఛార్జీల రూపంలో మిగలాల్సిన మొత్తాన్నీ కోల్పోతోంది. ప్రస్తుతం ద్వారపూడి కొండపైకి వెళ్లే దారి కూడా మూసుకుపోయింది. అక్కడ రైల్వే ట్రాక్‌ పనులు జరుగుతుండటంతో ప్లాంటు పరిస్థితి దారుణంగా మారింది.

అధికారంలోకి రాగానే..

2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ ప్లాంటుపై కక్షగట్టింది. ప్రారంభం నుంచే పట్టించుకోవడం మానేసింది. 2019 నుంచి 2020 డిసెంబరు మధ్యలో పలుమార్లు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ రెండేళ్ల కాలంలో రెండు నెలలు మాత్రమే పనిచేసింది. అనంతరం పునరుద్ధరించగా 2021 ఆగస్టు వరకు అందుబాటులో ఉంది. అరకొరగా విద్యుత్తు ఉత్పత్తి జరిగేది. మళ్లీ మరమ్మతులకు గురికావడంతో వదిలేశారు.  

వినియోగంలో ఉన్నప్పుడు సౌర పలకలతో ప్లాంటు(పాతచిత్రం)

సామగ్రి దొంగల పాలు

నిర్వహణను పూర్తిగా వదిలేయడంతో విలువైన ప్యానెళ్లు పాడయ్యాయి. కేబుళ్లన్నీ చోరీల పాలయ్యాయి. ప్యానెల్‌ స్టాండ్లు, విలువైన పరికరాలు మాయమవుతున్నాయి. సమీపంలోని రూ.లక్షల సాధారణ విద్యుత్తు ప్లాంటు మూతబడింది. నగరవాసుల డిమాండుతో దీనిని వేరే ప్రాంతానికి మార్చాలని అధికారులు భావించారు. గుణుపూరుపేటలోని డంపింగ్‌ యార్డు ఎదురుగా ఉన్న నాలుగున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు నెడ్‌ క్యాప్‌కు నగరపాలక అధికారులు సమాచారం అందించారు. గతేడాది మార్చి నెలాఖరు నాటికి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. పునరుద్ధరణకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.50 లక్షలు వెచ్చించడానికి కౌన్సిల్‌ ఆమోదం తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల తరువాత ఈ నిధులను వేరే పనులకు మళ్లిస్తూ కౌన్సిల్‌ తీర్మానించింది.

అశోక్‌ గజపతిరాజు చొరవతో..

నగరపాలిక అవసరాలు, విద్యుత్తు ఛార్జీలను తగ్గించడంలో భాగంగా తెదేపా హయాంలో అప్పటి కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేశారు. ద్వారపూడి సమీపంలోని కొండపై నిర్మాణం ప్రారంభించారు. 2017లో ఆయన చేతులమీదుగా ప్రారంభమైంది. నిర్వహణ బాధ్యతను శ్రీసావిత్రి సోలార్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు. రోజుకు 4 వేల నుంచి 4,500 యూనిట్ల మేర ఉత్పత్తి జరిగేది. నగరపాలిక అవసరాలకు పోనూ మిగిలిన యూనిట్లను ఏపీఈపీడీసీఎల్‌కు అమ్మేవారు. ఇలా నెలకు రూ.10 లక్షల ఆదాయం వచ్చేది.

ప్లాంటు దుస్థితి ఇదీ..

 

  • ప్రారంభించిన తేదీ: జులై 9, 2017
  • వ్యయం : రూ.4.80 కోట్లు
  • ఏర్పాటు చేసిన ప్యానెళ్లు : 3,140
  • రోజుకు ఉత్పత్తి: 4 వేల నుంచి 4,500 యూనిట్లు
  • పనిచేయకపోవడం వల్ల ఏడాదికి నష్టం : రూ.1.20 కోట్లు పైబడే

పునరుద్ధరణపై దృష్టి పెడతారట

ద్వారపూడిలోని సౌర విద్యుత్తు ప్లాంటు పునరుద్ధరణపై దృష్టి సారిస్తాం. సమస్యను ఇప్పటికే నెడ్‌ క్యాప్‌ అధికారులకు తెలియజేశాం. ఈ విషయంలో వారి పాత్ర ప్రధానమైంది. ఏర్పాటుకు వారు ముందుకు రావాల్సి ఉంటుంది. అక్కడి కొండపై అనుకూలంగా లేదనడంతోనే గుణుపూరుపేట మార్చాలని భావించి, స్థలం కేటాయించాం. త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.

కె.శ్రీనివాసరావు, ఈఈ, నగరపాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని