logo

ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?

శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్‌ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు.

Published : 19 Apr 2024 03:52 IST

శస్త్రచికిత్స చేయలేదని రోగి సహాయకుల ఆందోళన

కారులో రోగి రామారావు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుటడే: శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్‌ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. బొబ్బిలికి చెందిన టి.రామారావు ఇంట్లో జారిపడడంతో మక్క ఎముక విరిగింది. ఎనిమిది రోజుల కిందట సర్వజన ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. గురువారం శస్త్రచికిత్స చేస్తామని, ఆహారం తీసుకోవద్దని ఎముకల వైద్య నిపుణులు సూచించారు. ఆమేరకు అతనిని ఉదయాన్నే ఆపరేషన్‌ గదికి బంధువులు తీసుకొచ్చారు. మత్తు వైద్యులు వచ్చి చూసి వెళ్లాక సుమారు 4గంటల పాటు రోగి వద్దకు ఎవరూ రాలేదు. అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేదు. చివరికి వైద్యుడు వచ్చి సోడియం స్థాయిలు తగ్గాయని, తర్వాత ఆపరేషన్‌ చేద్దామని చెప్పి వెళ్లిపోయారు. గంటల తరబడి రోగిని ఆకలితో ఉంచడంతోనే సోడియం లెవల్స్‌ తగ్గాయని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ఆవరణలో కారులో రోగిని కూర్చొబెట్టి నిరసన తెలిపారు. పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి, ఇక్కడ వైద్య సేవలు ఎవరికీ అందడం లేదు.. ఉద్యోగులు ఎందుకు వస్తున్నారో..? ఏం చేస్తున్నారో? తెలియడం లేదని రోగి మేనల్లుడు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శేఖర్‌ ఆరోపించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని రోగి సహాయకులకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. వైద్యులతో మాట్లాడి తిరిగి అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని