logo

అవ్వాతాతలతో సర్కారు చెలగాటం

సామాజిక పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసి వైకాపా ప్రభుత్వం అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.

Published : 05 May 2024 05:12 IST

ఎండకు అల్లాడిన పింఛన్‌ దారులు

గజపతినగరం బ్యాంకు వద్ద వృద్ధుల పడిగాపులు

సామాజిక పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసి వైకాపా ప్రభుత్వం అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మూడో రోజు సైతం బ్యాంకు శాఖలు కిటకిటలాడాయి. సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారులు అందరికీ ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే అవకాశమున్నా.. బ్యాంకు ఖాతాల్లో జమచేసి.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేందుకు అధికార పక్షం చేసిన కుట్ర ఇది అని అవ్వాతాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు ఎండ తీవ్రత తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ ఎదురుచూసి ఉసూరుమంటూ వెనుదిరిగారు.

 - న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం, సీతంపేట, పాలకొండ, సీతానగరం, పార్వతీపురం పురపాలక, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, గజపతినగరం

 పార్వతీపురం పట్టణంలోని బందంవారి వీధి ఎస్‌బీఐ బ్రాంచికి పింఛను కోసం తూర్పువీధికి చెందిన వృద్ధుడు పి.శంకరరావు వచ్చారు. ఎండధాటికి విలవిల్లాడాడు. దీంతో స్థానికులు నీరు తాగించి ఇంటికి పంపించారు.


పునరుద్ధరణ..

మండలంలోని కొఠియా గ్రామాలతో పాటు ఇతర గిరిజన ప్రాంతాల నుంచి గిరిజనులు సాలూరులోని బ్యాంకులకు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే వచ్చారు. తెరిచిన తర్వాత కొందరి ఖాతాలు చెల్లుబాటులో లేవని తెలుసుకొని పునఃప్రారంభించారు. వారి నుంచి ఈకేవైసీ సేకరించి కొత్తగా ఫొటోలు, సంతకాలు తీసుకుని ఖాతాలను వినియోగంలోకి తీసుకువచ్చారు. మామిడిపల్లి ఏపీజీవీబీలో 20 మంది ఈ సేవలు అందుకున్నారు.


ఐదు కి.మీ వచ్చాం

వీరిది గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల కొండపైనున్న కప్పకల్లు గ్రామం. శనివారం సుమారు 5 కిలోమీటర్లు కాలినడకన తాడికొండ చేరుకుని, ఆటోలో ఎల్విన్‌పేట బ్యాంకుకు వచ్చారు. మధ్యాహ్నం మండుటెండలో ఇలా గ్రామానికి పయనమయ్యారు.  


గంటల కొద్దీ నిరీక్షణ..

సీతంపేటలోని యూనియన్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు, ఏపీజీవీబీ, ఖాతాదారుల సేవా కేంద్రాలకు దూర ప్రాంతాల నుంచి పింఛనుదారులు చేరుకున్నారు. ఆటోలు, బస్సుల్లో వచ్చి గంటల కొద్దీ నిరీక్షించి మండుటెండలో తిరుగుముఖం పట్టారు. ఆదివారం సెలవు కావడంతో ఎక్కువ మంది వచ్చారు. దీంతో సీతంపేట యూనియన్‌ బ్యాంకు ముందు గంటల కొద్దీ వృద్ధులు నిరీక్షించారు.


 ఖాతా లేకుండా డబ్బులెలా వేశారు..

పింఛను కోసం స్టేట్ బ్యాంకు చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్నా. సచివాలయానికి వెళ్తే స్టేట్‌ బ్యాంకు అకౌంటుకు డబ్బులు పడ్డాయన్నారు. అక్కడి వెళ్తే ఖాతా పుస్తకం తెమ్మన్నారు. అకౌంటు లేకుండా ఎక్కడ నుంచి తీసుకురాను. మూడు రోజులుగా తిరగలేక పోతున్నా.  

- ముత్యాల సావిత్రి, సీతానగరం


పండుటాకులకు తప్పని పాట్లు

నాకు పూర్తిగా చదువులేదు. బ్యాంకు పుస్తకానికి ఆధార్‌ అనుసంధానం కాలేదంటున్నారు. అది ఎలా అవుతుందో నాకు తెలియదు. అధికారులను అడిగితే ఏవేవో చెబుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇలా మమ్మల్ని ఎందుకు అవస్థలు పెడుతున్నారు.
- గురాన స్వాములమ్మ, సీతారాంపురం, గజపతినగరం


 రెండ్రోజులుగా తిరుగుతున్నా

గత రెండు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. ముందు వెంకటాపురం ఎస్‌బీఐ ఖాతాలో పడ్డాయన్నారు. శుక్రవారం అక్కడ కేంద్రం వద్దకు వెళితే పుస్తకం చూసి, పడలేదని, ఆన్‌లైన్‌ చేయాలన్నారు. తిరిగి శనివారం వచ్చాను. ఇప్పుడు ఏం చెబుతారో అని బెంగగా ఉంది.
- అప్పన్న, సీతారాంపురం, గజపతినగరం


కాళ్లు అరిగేలా తిరుగుతున్నా..

పింఛను కోసం మూడు రోజులుగా సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. బ్యాంకు ఖాతాలో నగదు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. సచివాలయానికి వచ్చి అడిగితే జమ అవుతుంది సోమవారం వరకు చూడమన్నారు. మూడు రోజులుగా కూలిపనికి వెళ్లకుండా తిరగడానికే సరిపోతుంది.  

- గాజుల పార్వతి, పాచిపెంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని