logo

జనం భూముల్లో జగన్‌ భూతం

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ఈశ్వరరావుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాస్‌బుక్‌, టైటిల్‌ పత్రాలు తన వద్దే ఉన్నాయి.

Updated : 05 May 2024 05:48 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో కొత్త చిక్కులు

భూముల రీ సర్వే పేరిట ఇప్పటికే మాయ

ప్రభుత్వ నిర్వాకంతో ఆస్తులకు రక్షణ కరవు

 

భూమికి రైతుకు ఉన్న సంబంధం విడదీయరానిది. అన్నం పెట్టి, ఆకలి తీర్చే భూదేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరుగాడాలి.    ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లే భావిస్తారు. రైతును ఉద్ధరించడంలో తానే గొప్పోడినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారి భూములను నొక్కేసే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. అతని అడుగులకు మడుగులొత్తే కొందరు తొత్తుల్లాంటి అధికారులతో చాప కింద నీరులా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. వారు భూమికి హక్కుదారులుగా ఏ పేరు రికార్డుల్లో రాస్తే వారిదే వారికే చెందుతుంది.  భూమి సమస్యలు తలెత్తితే సివిల్‌ కోర్టుల్లో సవాలు చేసి న్యాయం పొందే అవకాశం ఇప్పటి వరకు ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన పిడుగులాంటి చట్టంతో సివిల్‌ కోర్టుల్లో ఈ భూ వివాదాలు పరిష్కరించుకునే వీల్లేదు.

కొత్తవలసలో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేసిన న్యాయవాదులు (పాత చిత్రం)

  • విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ఈశ్వరరావుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాస్‌బుక్‌, టైటిల్‌ పత్రాలు తన వద్దే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం సమగ్ర భూ సర్వే పేరిట రీ సర్వే చేపట్టింది. విచిత్రం ఏమిటంటే.. ఈశ్వరరావు భూమి రెవెన్యూ రికార్డుల్లో అదే గ్రామానికి చెందిన రామారావు పేరిట నమోదైంది.
  •  కొత్తవలస మండలం దెందేరు, గులివిందాడలో కొందరు రైతులకు చెందిన భూములకు అధికార పార్టీ నాయకులు నకిలీ 1-బీ సృష్టించారు. ఆపై సర్వే నంబర్లు మార్పు, చేర్పులు చేసి ఇతరుల పేరుతో క్రయ ఒప్పందంతో కూడిన జీపీఏ చేయించుకుని కాజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం-2023 ఇటువంటి వాటికి హక్కులు కల్పించే అవకాశం ఉంది.
  •  పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన ఇద్దరు అన్నదమ్ములకు తండ్రి నుంచి ఏడెకరాల భూమి సంక్రమించింది. ఆస్తి పంపకాల్లో ఇద్దరికీ చెరో మూడున్నర ఎకరాలు దక్కింది. రికార్డుల్లో నమోదు చేశారు. ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే అనంతరం ఒకరి పేరిట నాలుగున్నర ఎకరాలు, మరొకరి పేరిట రెండున్నర ఎకరాలుగా నమోదైంది.
  • కొత్తవలస మండలంలోని  అర్ధానపాలెం రెవెన్యూలో ఆరు ఎకరాలకు పైగా భూమిని దస్త్రంలో ఉన్న చిన్న అవకాశాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ వారు తమ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించిన యజమానికి విషయం తెలిసి వెంటనే సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇక మీదట సివిల్‌ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఫలితంగా ఈ భూమి అధికార పార్టీ నాయకుల పరం అవుతుంది.

    నా భూమిని మార్చేశారు

నాకు అయిదె కరాలు ఉంది. ఇప్పుడు రికార్డుల్లో 1.47 ఎకరాలే కనిపిస్తోంది. మిగిలిన భూమి ఏ సర్వే, ఖాతా నంబర్లలో ఉందో తెలియదు. ఇందులో నా సంపాదనతో 1.43 ఎకరాలు కోనుగోలు చేశాను. దీంట్లో కేవలం 0.47 సెంట్లు రికార్డుల్లో చూపిస్తోంది.
- ఇజ్జురోతు బంగారునాయుడు, పీకే పాలవలస, చీపురుపల్లి మండలం


ఈనాడు - విజయనగరం, న్యూస్‌టుడే, కొత్తవలస, చీపురుపల్లి గ్రామీణ

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 1,950 గ్రామాల పరిధిలో సుమారు 20 లక్షల ఎకరాల భూములు (అన్ని రకాలు) ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న కమతాలే ఎక్కువ. పాత దస్త్రాల ఆధారంగా లావాదేవీలు, వారసత్వ పంపకాలు కొనసాగుతున్నాయి. భూ రికార్డుల విషయంలో సమగ్రత లేకపోవడం వల్ల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో తప్పుడు రికార్డులతో భూ రిజిస్ట్రేషన్లు జరగడం మరో సమస్యగా మారింది. వీటిపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. వీటి పరిష్కారానికే వందేళ్ల తర్వాత భూముల సర్వేకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వం చెబుతున్నా కొత్త వివాదాలకు కారణమవుతోంది.

 హైకోర్టు వరకు బక్క రైతులు వెళ్లగలరా?

ఉమ్మడి జిల్లాలో అర ఎకరా, ఎకరా ఉన్న చిన్న రైతులే ఎక్కువ. వీరికి పంట చేతికి రావడమే గగనం. ఉన్నకాడికి తిని, బతుకులు ఈడుస్తున్న ఇలాంటి వారు తమ భూములను రక్షించుకునేందుకు హైకోర్టు వరకు వెళ్లే పరిస్థితి ఉందా.. పోరాడే జవసత్వాలు బక్క రైతులకు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఈ చట్టం అమలైతే సొంత భూమిని వదులుకొని కూలి బతుకులు బతకడానికి రైతన్నలు సిద్ధం కావాల్సిందే మరి.. కొత్త చట్టం అమలైతే అందరూ నష్టపోతారని, సొంత భూములను సైతం వదులుకోవాల్సిందేనని వ్యవసాయ రంగ నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొడవళ్లు విసిరే ఆ రోజు రానుందేమో..

1960 దశకంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో ‘భూమి కోసం భుక్తి కోసం’ గిరిజన రైతులు పోరాటం చేశారు. తమ భూమికి తామే పరాయివారీగా మారిపోయామని, భూమి తమదైనా, హక్కు తమకు లేకపోవడమేమిటని ప్రశ్నిస్తూ కొడవళ్లు విసిరేందుకు గిరిజన రైతులు సిద్ధమయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి రచించిన కొత్త భూ చట్టం అమలులోకి వస్తే.. అప్పట్లో చవిచూసిన చీకటి రోజులు గిరిజన రైతులకు మళ్లీ ఎదురొచ్చే ప్రమాదం లేకపోలేదు.

ఇది బుర్ర లేని సర్కారు..: ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఓ దుర్మార్గం. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి బుర్ర లేదు. ఒక ఊళ్లో ఇద్దరి వ్యక్తుల మధ్య భూవివాదం నెలకొంటే ఇప్పటి వరకు సివిల్‌ కోర్టు పరిష్కరించేది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి అప్పీల్‌ అథారిటీకి వెళ్తుంది. అక్కడ జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారులు ఉంటారు. వారు ఏనాడూ ఇక్కడి పొలం చూసి ఉండరు. రైతులతో ఒక్కసారీ మాట్లాడి ఉండరు. దీన్ని వారెలా పరిష్కరిస్తారు. అత్యధిక కేసుల్లో కింది స్థాయి అధికారులు ఏం రాస్తే దానికే వారూ కట్టుబడి నిర్ణయాలు వెల్లడిస్తారు. లంచాలు తినమరిగిన అధికారులు, రాజకీయ ఒత్తిడితో వారు తీసుకునే నిర్ణయంతో ఎంతో మంది పేద రైతులు బలవుతారు. అక్కడ న్యాయం జరగలేదనుకుంటే అప్పుడు హైకోర్టును ఆశ్రయించాలి. సన్న, చిన్నకారు రైతుల్లో ఎంత మందికి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించి హైకోర్టును ఆశ్రయించే స్థోమత ఉంటుంది. ఇన్ని వేల కేసులను హైకోర్టు పరిష్కరించడం కూడా సాధ్యం కాదు.
- బి.రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు